WTC Final Equation:ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్.1.. మూడో స్థానానికి టీమిండియా

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. పెర్త్‌ టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత జట్టు.. రెండో టెస్టులో తేలిపోయింది. అడిలైడ్‌ వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఆతిథ్య జట్టు 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఐదు రోజుల పింక్‌బాల్ టెస్టు కాస్త రెండున్నర రోజుల్లోనే ముగిసింది.  

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగుల వద్ద ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 175 పరుగుల వద్ద అలౌటై.. కమ్మిన్స్ జట్టుకు 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆ టార్గెట్‌ను ఆసీస్‌ వికెట్లేమీ నష్టపోకుండా 20 బంతుల్లోనే చేధించింది. ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిపాలు కాకుండా బయటపడటమే ఈ టెస్టులో చెప్పుకోదగ్గ మంచి విషయం.

మూడో స్థానానికి టీమిండియా

ఈ ఓటమి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2023-25) ​​పాయింట్ల పట్టికలో భారత్ స్థానాన్ని కిందకు దిగజార్చింది. పాయింట్ల శాతాన్ని 61.11 నుండి 57.29కి తగ్గించి.. మూడో స్థానానికి పరిమితం చేసింది. మరోవైపు, విజయంతో ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానంలో నిలవగా.. దక్షిణాఫ్రికా(59.26) రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం సఫారీ జట్టు స్వదేశంలో శ్రీలంకతో తలపడుతోంది. ఈ ఇరు జట్ల మధ్య గెబర్హా వేదికగా రెండో టెస్ట్ జరుగుతోంది. ఇందులో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే తిరిగి అగ్రస్థానానికి చేరుకోగలరు.

Also Read :- పింక్ బాల్ టెస్ట్‎లో టీమిండియా ఘోర ఓటమి
 
ఫైనల్ రేసు నుంచి న్యూజిలాండ్ ఔట్

వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓటమి పాలైన న్యూజిలాండ్‌.. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో జరగనున్న చివరి టెస్టులో న్యూజిలాండ్ గెలిచినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రస్థుతానికి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కేవలం నాలుగు జట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక. ఇంగ్లండ్ ఇప్పటికే ఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్

  • ఆస్ట్రేలియా: 60.71 (విజయాల శాతం)
  • దక్షిణాఫ్రికా: 59.26 (విజయాల శాతం)
  • భారత్: 57.29 (విజయాల శాతం)
  • శ్రీలంక: 50.00 (విజయాల శాతం)
  • ఇంగ్లండ్: 45.24  (విజయాల శాతం)
  • న్యూజిలాండ్: 44.23  (విజయాల శాతం)