బ్రిజ్‌‌ భూషణ్‌‌కు మధ్యంతర బెయిల్

బ్రిజ్‌‌ భూషణ్‌‌కు మధ్యంతర బెయిల్

ఢిల్లీ: రెజ్లింగ్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌‌ఐ) మాజీ చీఫ్‌‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌‌ భూషణ్‌‌ శరణ్‌‌ సింగ్‌‌ కు కోర్టులో ఊరట లభించింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌‌ భూషణ్‌‌తో పాటు సస్పెండ్ అయిన డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్‌‌ మంజూరు చేసింది. డబ్ల్యూఎఫ్‌‌ఐ కార్యాలయంలో బ్రిజ్ భూషణ్ తమపై అనుచితంగా ప్రవర్తించారని ఇద్దరు మహిళా రెజర్లు ఆరోపించారు. 15 నుంచి 20 నిమిషాల పాటు తమను గదిలో నుంచి బయటకు వెళ్లనివ్వలేదని, బ్రిజ్ భూషణ్ చెడు ఉద్దేశంతోనే తమ ప్రైవేట్ పార్ట్స్ ను తాకాడని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు గత నెలలో వారిపై కేసు నమోదు చేశారు. కాగా, తనపై కొనసాగుతున్న లైంగిక వేధింపుల కేసులో బెయిల్ కోసం బ్రిజ్‌‌ భూషణ్‌‌ మంగళవారం ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. అయితే, బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌‌లపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌‌లో నిందితులిద్దరూ దర్యాప్తుకు సహకరించారని పేర్కొన్నారు. దీంతో కోర్టు వారిద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.