World Meditation Day 2024 : ఆరోగ్య సమాజానికి ధ్యానం దోహదం

ప్రతి దేశానికి యువతే  వెన్నెముక.  నేటి  యువత  ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల మత్తులో మునిగి తేలుతున్నది. ఈ తరుణంలో  చెడు వ్యసనాలకు  దూరం చేసి  ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలనే  దృఢ సంకల్పంతో.. ప్రతి సంవత్సరం  డిసెంబర్ 21న  ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలని  ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిర్ణయించింది. ఆధునిక మనిషికి యోగ్యమైన జీవిత ఆవశ్యకతను  పూర్వకాలంలోనే  ఋషులు,  మునులు  గుర్తించారు.   సుమారుగా  2,700  క్రి. పూ. నుంచే  యోగాను  సాధన చేసేవారని చారిత్రక ఆధారాల ద్వారా వెల్లడవుతోంది.  రామాయణంలోనూ  యోగా  ప్రస్తావన  ఉంది.   శ్రీ కృష్ణుడు  అర్జునుడికి చేసిన  ఉపదేశంలో  యోగా గురించి  చెప్పినట్టు భగవద్గీత  తెలుపుతున్నది.   వేదాలలో  అతి  ముఖ్యమైన ఋగ్వేదంలో  కూడా యోగా  గురించి ప్రస్తావించారు.  ఉపనిషత్తులలోనూ ఆరోగ్యం, యోగా గురించి విశదీకరించబడింది.  పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని మానవాళికి  అందించిన ఒక గొప్ప యోగిగా  చరిత్రలో నిలిచిపోయారు. 

యోగా, ధ్యానంతో శాస్త్రీయ ప్రయోజనాలు

మానసిక, శారీరక ఆరోగ్యంపై  ప్రయోజనకరమైన ప్రభావాల కారణంగా యోగా,  ధ్యానం పట్ల ప్రపంచ ప్రజల ఆసక్తి  రోజురోజుకూ పెరుగుతోంది.   యోగా సాధన వల్ల హైపర్‌‌‌‌‌‌‌‌‌‌ టెన్షన్, స్థూలకాయం, ఆందోళన, నిద్రలేమి తదితర రుగ్మతలను దూరం అవుతాయి.   యోగాభ్యాసం  అభ్యాసకులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు.   మనస్సు, శరీరం అనుసంధానం చేసేందుకు యోగా దోహదపడుతుంది.  ఆధునిక వైద్య శాస్త్రం కేవలం శరీరంపై మాత్రమే దృష్టి పెడుతుంది.  యోగాభ్యాసం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం  రెండూ లభిస్తాయని  శాస్త్రీయ పరిశోధనల ద్వారా వెల్లడైంది.   అష్టాంగ యోగ అనగా యోగా  ఎనిమిది అంగాలు. 

1. యమ (నైతిక ప్రమాణాలు): అహింస, సత్యం, నైతిక సూత్రాలు. 
2. నియమ (స్వీయ -క్రమశిక్షణ): శుభ్రత, సంతృప్తి,  స్వీయ- అధ్యయనం వంటి వ్యక్తిగత అభ్యాసాలు. 
3. ఆసనం (భంగిమలు): వశ్యత, బలం,  సమతుల్యతను పెంచడానికి రూపొందించిన శారీరక భంగిమలు. 
4. ప్రాణాయామం (బ్రీత్ కంట్రోల్):  శక్తి, మానసిక స్పష్టతను పెంచడానికి శ్వాసను నియంత్రించే పద్ధతులు. 
5. ప్రత్యాహార (ఇంద్రియాల ఉపసంహరణ): లోపలికి తిరగడం,  బాహ్య పరధ్యానాల నుంచి ఉపసంహరించుకోవడం. 
6. ధారణ (ఏకాగ్రత): ఒకే పాయింట్ లేదా వస్తువుపై  మనస్సును కేంద్రీకరించడం. 
7. ధ్యానం (ధ్యానం):  స్థిరమైన,  లోతైన ధ్యానం.
8. సమాధి (జ్ఞానోదయం): సంపూర్ణ సామరస్యం,  ఏకత్వ స్థితి.  సైద్ధాంతిక, ఆధ్యాత్మిక వివరణ. 

యోగాను  సరైన పద్ధతిలో  క్రమం తప్పకుండా  

ప్రతినిత్యం ఆచరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు,  మానసిక రుగ్మతలు తలెత్తకుండా కాపాడుకోవచ్చు.  యోగాలోని అన్ని ఆసనాలు చేయలేనివారు  కొన్ని రకాల ఆసనాలు ప్రధానంగా సూర్య నమస్కారాలు,  ప్రాణాయామాలు చేస్తూ  వాటివల్ల  కలిగే ఆరోగ్యప్రయోజనాలను పొందుతున్నారు.  యోగా విశిష్టతను ప్రతి ఒక్కరు  తెలుసుకొని ఆరోగ్యంగా ఉంటే  అదే ఈ  దేశానికి మహాభాగ్యం.  ఈ యోగాను  పూర్తిగా ఆచరణ చేయగలితే  పరిణతి చెందుతారు.  దానాలలోకెల్లా  విద్యాదానం చాలా శ్రేష్ఠమైంది.  దాని తరువాతది  లౌకిక జ్ఞానదానం,  ప్రాణదానం  అన్నదానం  అని వ్యాస మహర్షి  చెప్పారు.  ప్రపంచానికి  ‘జీరో’ మొదలుకొని  ఎన్నో అందించిన భారతదేశం ఎన్నో  ప్రత్యేకతలను కలిగి ఉంది.  మన సంస్కృతి,  సంప్రదాయాలను ప్రపంచ దేశాలు గౌరవించేందుకు యోగా సహకరిస్తోంది.    అతి త్వరలో  భారతదేశాన్ని  విశ్వగురువుగా చూడాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం! 

- డా. జంగం పాండు