మౌనంగా.. మహోన్నతంగా.. మన్మోహన్‎ను ​యాదిజేసుకున్న ప్రపంచ దేశాధినేతలు

  • భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మన్మోహన్​
  • యాదిజేసుకున్న ప్రపంచ దేశాధినేతలు

వాషింగ్టన్:  భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ముంగిట ఉన్న సమయంలో మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టిన మన్మోహన్ సింగ్​.. మౌనంగా, మహోన్నతంగా పనిచేసి దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దారని ప్రపంచ దేశాధినేతలు యాదిజేసుకున్నారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, శ్రీలంక, రష్యా, చైనా, బ్రిటన్, అఫ్గానిస్తాన్, మాల్దీవులు, మారిషస్, నేపాల్ తదితర దేశాధినేతలు మన్మోహన్​కు నివాళులు అర్పించారు. ఆయన హయాంలో భారత్​తో తమ ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో మెరుగయ్యాయని అన్నారు.

అమెరికా, రష్యా, చైనా, ఇరాన్, ఫ్రాన్స్, తదితర దేశాల దౌత్యవేత్తలు కూడా మన్మోహన్​ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. భారత అభివృద్ధి పట్ల ఆయన ఎంతో అంకితభావంతో సేవలు అందించారని కొనియాడారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసిన గొప్ప చాంపియన్లలో మన్మోహన్ ఒకరు అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కొనియాడారు. ఆయన హయాంలో కుదిరిన యూఎస్–ఇండియా న్యూక్లియర్ డీల్ రెండు దేశాల సంబంధాల్లో కీలక మలుపుగా నిలిచిందన్నారు. భారత్ ఒక గొప్ప మనిషిని, ఫ్రాన్స్ ఒక నిజమైన మిత్రుడిని కోల్పోయాయని ఆ దేశ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్ అన్నారు. మన్మోహన్ ఒక గొప్ప విజనరీ లీడర్ అని శ్రీలంక ప్రెసిడెంట్ దిసనాయకే కొనియాడారు.

మన్మోహన్ సేవలతో భారతదేశానికి కొత్త శకం ప్రారంభమైందని శ్రీలంక మాజీ ప్రెసిడెంట్ మహీంద రాజపక్స పేర్కొన్నారు. మన్మోహన్ మృతి తనలో తీవ్ర విషాదాన్ని నింపిందని కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ అన్నారు. ఆయన అసాధారణ ప్రతిభ, తెలివితేటలు గల నాయకుడని ప్రశంసించారు. మన్మోహన్ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన మరణం బాధాకరమని నేపాల్ మాజీ ప్రధాని పీకే ప్రచండ ట్వీట్ చేశారు. ఒక తండ్రిలా, ఒక మంచి స్నేహితుడిలా తమను చూసుకున్నారని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ పేర్కొన్నారు. అఫ్గాన్ ప్రజలకు మన్మోహన్ గొప్ప మిత్రుడు అని ఆ దేశ మాజీ ప్రెసిడెంట్ హమీద్ కర్జాయ్ ట్వీట్ చేశారు. 

నా పిల్లలకు స్కాలర్ షిప్ ఆఫర్ చేశారు: మలేసియా పీఎం  

మన్మోహన్ సింగ్ మంచి మనసున్న వ్యక్తి, మానవతావాది అని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం కొనియాడారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. మన్మోహన్ దయా గుణాన్ని వివరిస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘నా మిత్రుడు మన్మోహన్ మరణించాడన్న వార్త ఎంతో బాధ కలిగించింది. ప్రపంచ ఆర్థిక దిగ్గజాల్లో ఒకటిగా భారత్ నిలవడంలో ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానిగా ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు.

1990 ప్రాంతంలో మేమిద్దరం ఆర్థిక శాఖ మంత్రులుగా పని చేశాం. మన్మోహన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలను దగ్గరుండి చూశాను. మేం ఇద్దరం అవినీతిపై పోరాడాం. ఒక కీలకమైన కేసును బయటపెట్టడంలో సహకారం అందించుకున్నాం” అని పోస్టులో ఇబ్రహీం పేర్కొన్నారు. ‘‘నేను జైల్లో ఉన్నప్పుడు మన్మోహన్ నా విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించారు. నా పిల్లలకు స్కూల్ ఫీజుల కోసం స్కాలర్ షిప్ ఆఫర్ చేశారు. కానీ నేను ఆయన ఆఫర్​ను సున్నితంగా తిరస్కరించాను. ఇది మన్మోహన్ మానవత్వానికి, దయా గుణానికి ప్రతీక. గుడ్ బై మిత్రమా.. మై భాయ్.. మన్మోహన్” అని పోస్టులో ఇబ్రహీం పేర్కొన్నారు.

తెలివైన, నిజాయతీగల ప్రధాని:  ఒబామా

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్  సింగ్​పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్  ఒబామా సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మన్మోహన్​తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే, తాను రచించిన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్  ల్యాండ్’ లో మన్మోహన్​ను ప్రశంసించిన విషయాన్ని ప్రస్తావించారు. ‘‘మన్మోహన్  సింగ్  అసాధారణమైన నాయకత్వంగల మనిషి.

ఆయన విజ్ఞానం అసామాన్యం. భారత ప్రజల సంక్షేమం కోసం ఆయన అంకితభావంతో పనిచేశారు. కొన్ని లక్షల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయన ఎంతో తెలివైన నిజాయతీగల ప్రధాని. అలాగే, ఆయన ధరించే తలపాగాలో ఆయన ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు” అని ఆ పుస్తకంలో ఒబామా కొనియాడారు.

బుష్​పై మన్మోహన్  పొగడ్తలతో దుమారం

అమెరికా, భారత్ మధ్య అణు ఒప్పందం కుదిరిన సందర్భంగా 2008లో వాషింగ్టన్ లో అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ పై మన్మోహన్ సింగ్ పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘భారత ప్రజలు మిమ్మల్ని ఎంతో డీప్ గా ప్రేమిస్తున్నారు” అని కామెంట్ చేయడం దుమారం రేపింది. ఒకవైపు న్యూక్లియర్ డీల్ తో భారత్​కు నష్టమని ప్రతిపక్ష బీజేపీతో సహా లెఫ్ట్ పార్టీలు కూడా వ్యతిరేకించిన తరుణంలో మరోవైపు మన్మోహన్ అమెరికా అధ్యక్షుడిని పొగడటంపై విమర్శలు వచ్చాయి. ‘‘భారత్ పై అణు సరఫరాదారుల సంఘం 34 ఏండ్లుగా వివక్ష చూపుతూ న్యూక్లియర్ మెటీరియల్ కొనుగోలు చేయకుండా అడ్డుకున్నది.

ఇప్పుడు అణు ఒప్పందానికి అంగీకరించడం ద్వారా మీరు భారత్ కు గొప్ప మేలు చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. భారత ప్రజలు మిమ్మల్ని ఎంతో డీప్ గా ప్రేమిస్తున్నారు” అని మన్మోహన్ వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో అన్నారు. బుష్ కూడా మన్మోహన్​పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, బుష్​ను మన్మోహన్ వ్యక్తిగతంగా ఎంతైనా ప్రేమించుకోవచ్చని, కానీ మధ్యలో భారత ప్రజలను ఎందుకు లాగారంటూ ఇటు లెఫ్ట్ పార్టీలు, అటు బీజేపీ అప్పట్లో ఘాటుగా విమర్శించాయి.

బార్డర్ సమస్య పరిష్కారానికి కృషి చేశారు: చైనా 

భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగయ్యేం దుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సానుకూల సేవలు అందించారని చైనా కొనియాడింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ శుక్రవారం  మీడియాతో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు మన్మోహన్ హయాంలోనే కీలక ఒప్పందాలు కుదిరాయని గుర్తు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో ఆయన చూపిన మార్గం దోహదం చేస్తుందన్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్తను కోల్పోయిన భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

భారత్, రష్యా బంధాన్ని పటిష్టం చేశారు: పుతిన్ 

భారత్, రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, స్నేహపూర్వక బంధాన్ని పెంపొందించడంలో మన్మోహన్ సింగ్ ఎనలేని కృషి చేశారని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనియాడారు. ఇరుదేశాల సంబంధాలు ఆయన హయాంలో మరింత పటిష్టం అయ్యాయన్నారు. భారత ఆర్థిక అభివృద్ధిలో మన్మోహన్ పాత్ర కీలకమని, అలాగే ప్రపంచ వేదికపై దేశ ప్రయోజనాలను కాపాడటంలోనూ ఆయన సమర్థంగా పని చేశారన్నారు. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిన భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. 

మన్మోహన్ మనసు పెట్టి పనిచేశారు: పాక్

ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత మాజీ ప్రధాని మన్మోహన్ ​సింగ్ ​తనను తాను అంకితం చేసుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరి అన్నారు. మన్మోహన్ మృతిపై శుక్రవారం లాహోర్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మన్మోహన్​తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొత్తం సార్క్ ప్రాంతంలో సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించిన ఘనత సింగ్‌‌‌‌ది అన్నారు.

‘‘అమృత్‌‌‌‌సర్‌‌‌‌లో అల్పాహారం, లాహోర్‌‌‌‌లో మధ్యాహ్న భోజనం, కాబూల్‌‌‌‌లో రాత్రి భోజనం చేయడం సాధ్యమయ్యే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని” ఇండియా ప్రధానిగా సింగ్ చేసిన ప్రకటనే దీనికి ఉదాహరణగా చెప్పారు. రెండు దేశాల ప్రభుత్వాలు, ప్రజల మధ్య సంబంధాలు పెంచేలా ఆయన తన హృదయం, ఆత్మను పెట్టి కృషి చేశాడన్నారు. పాక్ లోని పంజాబ్‌‌‌‌లో తన జన్మస్థలమైన గాహ్‌‌‌‌ను సందర్శించాలని సింగ్ కోరుకున్నారు. అయితే ఆయన సతీమణి గురుశరణ్‌‌‌‌ కౌర్‌‌‌‌, కుటుంబ సభ్యులు సింగ్​ జన్మస్థలాన్ని సందర్శించే రోజు వస్తుందని కసూరి ఆశాభావం వ్యక్తం చేశారు.

గురువును కోల్పోయాను: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ:  రాహుల్ గాంధీ మాట్లాడుతూ " మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపారమైన జ్ఞానం, సమగ్రతతో దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. ఆయనలోని వినయం, ఎకనామిక్స్​పై లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన గురువును కోల్పోయాను. దేశ ప్రజలు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు" అని పేర్కొన్నారు.

మిత్రుడిని కోల్పోయా.. 

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి, పార్టీకి తీరని లోటు. మిత్రుడిని, ఫిలాసఫర్ ను, గైడ్ ను కోల్పోయాను. వివేకం, వినయానికి ప్రతిరూపం మన్మోహన్. ఆయన వ్యక్తిగతంగా సౌమ్యుడే అయినప్పటికీ, తన నిర్ణయాలకు సంబంధించి చాలా దృఢ నిశ్చయంతో ఉండేవారు. సోషల్ జస్టిస్, సెక్యులరిజం, ప్రజాస్వామ్య విలువలపై నిబద్ధతతో ఉండేవారు. మన్మోహన్ తో మాట్లాడటం అంటే జ్ఞానాన్ని పొందడమే. అతని నిజాయితీ, వినయం చూసి విస్మయం చెందుతాం. ఇలాంటి లీడర్ ఉన్నందుకు దేశ పౌరులుగా, కాంగ్రెస్ పార్టీ నేతలుగా మేం ఎప్పుడూ గర్వపడతాం.  సోనియా గాంధీ