ప్ర‌పంచ బుర్ర‌ల (బ్రెయిన్) డే.. షార్ప్ గా ప‌ని చేయాలంటే ఏం తినాలి

ప్ర‌పంచ బుర్ర‌ల (బ్రెయిన్) డే.. షార్ప్ గా ప‌ని చేయాలంటే ఏం తినాలి

డాక్టర్స్ డే, ఇంజినీర్స్ డే, లాయర్స్ డే.. ఇలా ప్రతీ ఒక్క వృత్తికీ, విషయానికీ ఒక రోజు ఉంటుంది. అలాగే మన మెదడుకూ ఓ రోజుంది. అవునండీ.. 24గంటలూ పనిచేసే మన బ్రెయిన్ కి కనీసం ఒక్క రోజు కూడా ఉండకపోతే ఎలా.. వినడానికి కొత్తగా, వింతగా అనిపించినా.. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మాటలు కావు. ఏటా జూలై 22న జరుపుకునే ఈ మెదడు దినోత్సవం రోజున ఆరోగ్యంగా ఉండేందుకు, జ్ఞాపకశక్తిని మరింత మెరుగుపర్చేందుకు తినాల్సిన ఆహారం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా.. పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అలాగే గుమ్మడికాయ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, రాగి, ఇనుము, మెగ్నిషియం, జింక్ వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. వీటి వల్ల అల్జీమర్స్, నిరాశ, మూర్ఛ వంటి అనేక రుగ్మతలను నివారించవచ్చు.

అరటి పండు

అరటి పండు రోజూవారి ఆహారంలో తీసుకోవాల్సిన ఉత్తమ పండుగా చెప్పవచ్చు. ఇందులో   విటమిన్ బీ6 మూడింట రెండు వంతులు ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి, మెదడుకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో ఉండే ప్లేవనాయిడ్స్.. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. అంతే కాకుండా జ్ఞాపకశక్తి, మానసిక శక్తి.. రెండింటినీ పెంచుతాయి.

గుడ్లు

గుడ్లలో ఉండే విటమిన్ బి మెదడు మానసిక స్థితిని నియంత్రించడానికి, మెదడు సరిగా పనిచేయడానికి తోడ్పడుతుంది.

సాల్మన్ ఫిష్

మెదడు సజావుగా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి, మెరుగుపడడానికి ఇందులో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అత్యంత దోహదపడతాయి.

వాల్ నట్స్

ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అని పిలిచే ఈ వాల్ నట్స్ లో ఒక రకమైన ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె, మెదడుకు కూడా మేలు చేస్తుంది.

నారింజ

విటమిన్ సి అధికంగా ఉండే నారింజ.. మెదడును ఫ్రీ రాడికల్స్ నుంచి దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ

చురుకుదనాన్ని పెంచే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్.. మెదడను రక్షిస్తాయి. మెదడు ప్రశాంతంగా ఉండేందుకు ఇది సహకరిస్తుంది.

పసుపు

మెదడు కణాల పెరుగుదలకు పసుపు తోడ్పడుతుంది. అల్జీమర్స్ నుంచి రక్షించే కర్కుమిన్ ఇందులో ఉంటుంది.

బ్రోకలీ

జ్ఞాపకశక్తి షార్ప్ గా ఉంచడంలో సహాయపడే విటమిన్ కె, కోలిన్.. బ్రోకలీలో పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

వీటితో పాటు మరికొన్ని ఆహారపు అలవాట్లతో పాటు సరైన జీవనశైలి కూడా మెదడు పని తీరును మెరుగ్గా చేసేందుకు, జ్ఞాపకశక్తి పెంచేందుకు సహకరిస్తాయి.