న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలోని (ఇన్‌ఫార్మల్ సెక్టార్) కార్మికులకు ప్రభుత్వ స్కీములను, ఇతర రాయితీలను వర్తింపజేయడానికి అందుబాటులోకి తెచ్చిన ఈ–శ్రమ్ పోర్టల్‌లో భారీగా కార్మికులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటున్నారని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖల మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం ప్రకటించారు. మనదేశంలోని ప్రతి మూడో ఇన్‌ఫార్మల్ సెక్టార్ కార్మికుడు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడని వెల్లడించారు. దీంతో మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 14 కోట్లకు చేరుకుందని చెప్పారు. పోర్టల్ డేటా ఆధారంగా ఇన్‌ఫార్మల్ సెక్టార్ కార్మికులకు సోషల్ సెక్యూరిటీ స్కీములను, ఇతర ప్రయోజనాలను వర్తింపజేస్తామని ప్రకటించారు. ఈ–శ్రమ్ పోర్టల్‌ను ఈ ఏడాది ఆగస్టు 26న మొదలుపెట్టారు. నాలుగు నెలల్లో 14 కోట్ల మంది చేరడం గొప్ప విషయమని మంత్రి కామెంట్ చేశారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా జార్ఖండ్ నుంచి రిజిస్ట్రేషన్లు ఎక్కువగా వచ్చాయి. మొత్తం కార్మికుల్లో 52.56 శాతం స్త్రీలు కాగా 47.44 శాతం పురుషులు ఉన్నారు.
