- ఫుల్‌స్పీడ్‌లో గేమింగ్స్ ఇండస్ట్రీ
- మొబైల్ గేమింగ్‌కు అద్భుత భవిష్యత్
ఒక్క గేమ్ జీవితాన్నే మార్చేస్తుంది. పబ్జీ, యాంగ్రీబర్డ్స్ వంటి గేమ్స్ తయారు చేయగలిగిన కంపెనీలకు కోట్ల రూపాయల వర్షం కురుస్తోంది. అందుకే ఐటీ నిపుణులు ఎందరో గేమింగ్ డెవలపర్లుగా మారుతున్నారు. ఒక మంచి గేమ్ తయారు చేయగలిగితే జీవితాంతం ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. అంతేగాక స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది కాబట్టి మొబైల్ గేమింగ్ కూడా ఎక్కువయింది. మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ కూడా పరుగులు పెడుతోంది. 2018లో గ్లోబల్ గేమ్స్ మార్కెట్ 138 బిలియన్ డాలర్లకు అంటే రూ.9,60,706 కోట్లకు చేరుకుంది. ఈ మార్కెట్ 2021 నాటికి 180 బిలియన్ డాలర్లకు(రూ.12,54,004 కోట్లకు) చేరుకుంటుందని మార్కెట్ రీసెర్చర్ న్యూజూ అంచనావేస్తోంది.
బిజినెస్ డెస్క్, వెలుగు: గేమ్స్ మార్కెట్‌కు అద్భుత భవిష్యత్ ఉంటుందని, డౌన్‌లోడ్స్ విపరీతంగా పెరుగుతాయని స్టడీలు చెబుతున్నాయి. గ్లోబల్ గేమ్స్ మార్కెట్‌లో మొబైల్ గేమ్స్ మార్కెట్ ఈ ఏడాది 70.3 బిలియన్ డాలర్ల రెవెన్యూలను జనరేట్ చేయనుందని న్యూజూ పేర్కొంటోంది. అంటే మొత్తం మార్కెట్‌లో 51 శాతం దీనిదే. 2021 నాటికి ఈ మొబైల్ గేమ్స్ మార్కెట్106.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కూడా చెబుతోంది. గ్లోబల్ గేమ్స్ మార్కెట్‌లో ఇదే అతిపెద్ద సెగ్మెంట్. న్యూజూ అంచనాల ప్రకారం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది గేమర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ అంతా డిజిటల్‌గా మారుతోంది. 91 శాతం గ్లోబల్ మార్కెట్ డిజిటల్‌గానే ఉంది. అంటే 125.3 బిలియన్ డాలర్ల విలువైన గేమ్స్ ఫ్లోస్ కూడా డిజిటల్‌గా కనెక్ట్ అయిన ఛానళ్ల ద్వారానే సాగుతున్నట్టు న్యూజూ పేర్కొంది.
కన్సోళ్లకూ డిమాండ్
ఇక రెండో అతిపెద్ద సెగ్మెంట్‌గా కన్సోల్ గేమింగ్ ఉంది. ఇది 2018లో 34.6 బిలియన్ డాలర్ల రెవెన్యూలను జనరేట్ చేసింది. పీసీ గేమ్స్ 32.9 బిలియన్ డాలర్లను అందించాయి. గేమింగ్ ఇండస్ట్రీ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 2017 నుంచి 2021 మధ్య కాలంలో 10.3 శాతంగా ఉంటుందని న్యూజూ తెలిపింది. ఈ పదేళ్లలో కూడా మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ గ్రోత్ రేటు రెండెంకెల స్థాయిలోనే ఉంది. పీసీ, కన్సోల్ గేమ్స్ గత కొన్నేళ్ల నుంచి స్థిరంగా వృద్ధి సాధిస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది కన్సోల్ గేమింగ్ మొత్తం మార్కెట్‌లో 25 శాతంగా ఉంది. పీసీ గేమింగ్ 24 శాతం మార్కెట్ షేరును దక్కించుకుంది. డౌన్‌లోడెడ్ పీసీ గేమ్స్ వార్షికంగా 2017 నుంచి 2021 మధ్య కాలంలో 4.2 శాతం ప్లస్‌లో వృద్ధి సాధించనున్నాయని, ఇవి 2021లో 32.3 బిలియన్ డాలర్లను జనరేట్ చేయనున్నాయని న్యూజూ అంచనావేసింది.
ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కొట్టిన గేమర్స్..
ఆల్ టైమ్ గేమింగ్ సక్సెస్ స్టోరీస్‌లో యాంగ్రీ బర్డ్స్‌కు చెందిన రోవియో ఒకటి. ఇది ఫిన్‌ల్యాండ్‌లోనే చిన్న గేమింగ్ కంపెనీగా 2003లో ఏర్పాటైంది. వీరివి ఆరేళ్ల కాలంలో 50కి పైగా గేమ్స్ ఫెయిల్ అయినవే. దివాలా స్థితికి కూడా వెళ్లింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా.. 2009లో 52వ గేమ్‌గా యాంగ్రీ బర్డ్స్‌ను ప్రవేశపెట్టారు. యాంగ్రీ బర్డ్స్ ఒక్కసారిగా వీరి తలరాతల్ని మార్చేసింది. 100 కోట్ల డాలర్ల వాల్యుయేషన్‌తో ఇది స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కూడా అయింది. అలాగే టెంపుల్ రన్ గేమ్‌ను క్రియేట్ చేసిన ఇమాంగి స్టూడియోస్ కూడా 8 గేమ్స్ తర్వాతనే సక్సెస్ అయింది. పోకోమ్యాన్ సిరీస్ వాళ్లు కూడా అంతే. క్యాండీ క్రష్ గేమ్‌ను క్రియేట్ చేసిన కింగ్.కామ్ 16 ఏళ్లకు సక్సెస్ రుచిచూసింది. ఒక్క గేమ్ సక్సెస్ అయితే అది రోజుకు 20 లక్షల డాలర్ల రెవెన్యూలను ఆర్జిస్తుందని కూడా న్యూజూ తెలిపింది.
చిన్నప్పటి నుంచీ గేమ్స్ అంటే పడి చచ్చేవాళ్లే గేమింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవగలరు. ఊహ తెలిసినప్పటి నుంచీ కంప్యూటర్ గేమ్స్ ఆడటంతోనే నాకు ఈ ఇండస్ట్రీపై ఇష్టం పెరిగింది. కంపెనీ మొదలు పెట్టినప్పుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. దాంతో 600 గేమ్స్ డెవలప్ చేశాం. మొబైల్ గేమ్స్ ఊపందుకునేప్పటికీ కొంచెం వెనకబడ్డాం. కానీ, సరైన రిసోర్సెస్ అందుబాటులో ఉంటే, ఇప్పుడు మొబైల్ గేమ్స్‌లో దూసుకెళ్తాం. రాబోయే ఆరు నెలల్లో ఒక హిట్ గేమ్ కొట్టాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నాం. పది దాకా 7 సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మొబైల్ గేమ్స్ ఇప్పటికే వేలాది మంది గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నారు. కాలక్షేపానికైనా, ప్రొఫెషనల్‌గా ఆడేవారికైనా మొబైల్ గేమ్స్ కి ఆల్టర్నేటివ్ ఇప్పట్లో రాదు. ఈ ఇండస్ట్రీలో ఎంతమందికైనా చోటు ఉంటుంది. ఇండియాలో మంచి భవిష్యత్ ఉన్న రంగాలలో మొదటి అయిదు రంగాలలో మొబైల్ గేమింగ్ ఉంది. మొబైల్ గేమింగ్ ఎవర్‌గ్రీన్ సెగ్మెంట్. మారుతీ శంకర్, ఎండీ, 7సీస్ ఎంటర్ టైన్‌మెంట్ లిమిటెడ్
