Women's T20 World Cup 2024: కప్‌‌‌‌ కొట్టేదెవరో.. నేటి నుంచి విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌

  • టైటిలే లక్ష్యంగా హర్మన్‌‌‌‌సేన
  • ఫేవరెట్స్‌‌‌‌గా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌, సౌతాఫ్రికా

దుబాయ్‌‌‌‌: విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి యూఏఈలో జరిగే మెగా పోరులో టైటిలే లక్ష్యంగా ప్రతి జట్టు సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది ఎడిషన్లలో ఆరుసార్లు టైటిల్‌‌‌‌ నెగ్గిన ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని తెర దించాలని మిగతా టీమ్‌‌‌‌లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో అరబ్‌‌‌‌ గడ్డపై పొట్టి కప్‌‌‌‌ పోటీలు మరో లెవెల్లో ఉండనున్నాయి. షెడ్యూల్‌‌‌‌ ప్రకారం ఈ టోర్నీకి బంగ్లాదేశ్‌‌‌‌ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ బంగ్లాలో రాజకీయ సంక్షోభం కారణంగా టోర్నీని యూఏఈకి తరలించారు.

టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌‌‌‌లుగా విభజించారు. గ్రూప్‌‌‌‌–ఎలో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌, శ్రీలంక, గ్రూప్‌‌‌‌–బిలో బంగ్లాదేశ్‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌, స్కాట్లాండ్‌‌‌‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌‌‌‌ ఉన్నాయి. ప్రతి గ్రూప్‌‌‌‌లో టాప్‌‌‌‌–2లో నిలిచిన రెండు జట్లు సెమీస్‌‌‌‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో నెగ్గిన టీమ్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో తలపడనున్నాయి. గురువారం జరిగే తొలి డబుల్‌‌‌‌ హెడర్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌.. స్కాట్లాండ్‌‌‌‌తో, పాకిస్తాన్‌‌‌‌.. శ్రీలంకతో తలపడతాయి. 

ఇండియా ఈసారైనా..

2009లో మొదలైన ఈ టోర్నీలో ఇండియా ఎనిమిదిసార్లు బరిలోకి దిగింది. కానీ ఒక్కసారి కూడా కప్‌‌‌‌ కొట్టలేదు. 2020లో ఫైనల్‌‌‌‌కు చేరినా ఆసీస్‌‌‌‌ చేతిలో ఓడింది. లీగ్‌‌‌‌ మొత్తం అద్భుతంగా ఆడిన టీమిండియా టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో ఓడిన తీరు ఫ్యాన్స్‌‌‌‌ను ఆగ్రహానికి గురి చేసింది. 2009, 2010లో సెమీస్‌‌‌‌కు చేరిన ఇండియా 2012, 2014, 2016లో తొలి రౌండ్‌‌‌‌లోనే ఇంటిముఖం పట్టింది. 2018, 2023లో సెమీస్‌‌‌‌లో నిరాశపర్చింది. దీంతో ఈసారి ఎలాగైనా కప్‌‌‌‌ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. శుక్రవారం న్యూజిలాండ్‌‌‌‌తో జరిగే తొలి పోరులో హర్మన్‌‌‌‌సేన మెగా టోర్నీ వేటను మొదలుపెడుతుంది. అయితే టోర్నీ కోసం సిద్ధమైన తీరు అభిమానులను మరోసారి కలవరపెడుతోంది.

గత రెండు నెలలుగా టీమిండియా ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడనేలేదు. జులైలో శ్రీలంకతో జరిగిన ఆసియా కప్‌‌‌‌ ఫైనలే ఇండియాకు చివరి మ్యాచ్‌‌‌‌. అయితే సన్నాహక శిబిరం మాత్రం బాగా జరిగింది. చాంపియన్‌‌‌‌గా నిలవడానికి అవసరమైన అన్ని వనరులు ఉన్నా కీలక మ్యాచ్‌‌‌‌లో సమష్టిగా ఆడటంలో టీమిండియా ఫెయిలవుతోంది. మరోవైపు ఇండియా ఉన్న గ్రూప్‌‌‌‌లో అన్నీ బలమైన జట్లే ఉన్నాయి. వాటిని దాటి ముందుకెళ్లాలంటే శక్తికి మించి శ్రమించాలి. నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో కనీసం మూడు గెలవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యుత్తమంగా ఆడితే తప్ప ముందంజ వేయడం కష్టం. ముఖ్యంగా ఆసీస్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ గెలిస్తే సగం కప్‌‌‌‌ గెలిచినట్లే. కాబట్టి సమష్టి పోరాటం ఇండియా ఈసారి కప్‌‌‌‌ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

ఆసీస్‌‌‌‌కు చెక్‌‌‌‌ పడేనా?

వరల్డ్‌‌‌‌ కప్స్‌‌‌‌ అంటే ఆస్ట్రేలియాకు తిరుగుండదు. అది వన్డే అయినా టీ20 కప్‌‌‌‌ అయినా. బరిలోకి దిగిన ప్రతిసారి ఏదో ఓ మ్యాజిక్‌‌‌‌తో ఈజీగా కప్‌‌‌‌ను కొడుతుంది. అలాంటి ఆసీస్‌‌‌‌ ఆధిపత్యా నికి ఈసారి ఎలాగైనా అడ్డంకి వేయాలని ప్రతి జట్టు కోరుకుంటోంది. ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌‌‌‌ నుంచి ఆసీస్‌‌‌‌కు పోటీ తప్పకపోవచ్చు. ఇంగ్లండ్‌‌‌‌ (2009), వెస్టిండీస్‌‌‌‌ (2016) ఇప్పటికే చెరోసారి టైటిల్స్‌‌‌‌ గెలిచాయి. కాబట్టి ఆ అనుభవాన్ని ఇప్పుడు చూపెట్టాలని భావిస్తున్నాయి. ప్లేయర్ల పరంగా చూసినా ఇంగ్లండ్‌‌‌‌, సౌతాఫ్రికాలో ఆల్‌‌‌‌రౌండర్లకు కొదవలేదు. ప్రస్తుతం టోర్నీకి ఆతిథ్యమిస్తున్న యూఏఈ పిచ్‌‌‌‌లన్నీ స్పిన్‌‌‌‌కు అనుకూలంగా ఉన్నాయి. నాణ్యమైన స్పిన్నర్లు ఉన్న జట్టు కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి అన్ని జట్లకు సమాన అవకాశాలున్న మెగా టోర్నీలో ఈసారి కప్‌‌‌‌ ఎవరు కొడతారో చూడాలి.