Women's T20 World Cup 2024: తేలిపోయిన హర్మన్‌ బృందం.. తొలి మ్యాచ్‌‌‌‌లో ఓటమి

దుబాయ్‌‌‌‌: భారీ అంచనాలతో బరిలోకి దిగిన  ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌.. టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో తేలిపోయింది. స్టార్లంతా అంచనాలు అందుకోవడంలో విఫలం కావడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ తొలి మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 58 రన్స్‌‌‌‌ తేడాతో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్నది. టాస్‌‌‌‌ నెగ్గిన కివీస్‌‌‌‌ 20 ఓవర్లలో 160/4 స్కోరు చేసింది. సోఫీ డివైన్‌‌‌‌ (36 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లతో 57 నాటౌట్‌‌‌‌), జార్జియా ప్లిమెర్‌‌‌‌ (34) రాణించారు. ఛేజింగ్‌లో ఇండియా 19 ఓవర్లలో 102 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (15) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. రోస్‌‌‌‌మేరి మెయిర్‌‌‌‌ 4, లీ తహుహు 3, ఎడెన్‌‌‌‌ కార్సన్‌‌‌‌ 2 వికెట్లు తీశారు. డివైన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. కివీస్‌ ఈ ఫార్మాట్‌లో వరుసగా 10 ఓటముల తర్వాత విజయం అందుకుంది.  కాగా, ఆదివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో ఇండియా... పాకిస్తాన్‌తో తలపడనుంది.

డివైన్‌‌‌‌ కీలక భాగస్వామ్యాలు..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కివీస్‌‌‌‌ను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. పిచ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలంగా ఉండటంతో ఓపెనర్లు సుజీ బేట్స్‌‌‌‌ (27), ప్లిమెర్‌‌‌‌ ధాటిగా ఆడారు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు కొడుతూ పవర్‌‌‌‌ప్లేలోనే 55/0 స్కోరు చేశారు. తర్వాత కూడా అదే జోరును కొనసాగించినా 8వ ఓవర్‌‌‌‌లో అరుంధతి రెడ్డి (1/28) ఈ జంటను విడదీసింది. ఓ ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌తో బేట్స్‌‌‌‌ను దెబ్బకొట్టింది. దీంతో తొలి వికెట్‌‌‌‌కు 67 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌‌‌ తొలి బాల్‌‌‌‌కే ఆశా శోభన (1/22).. ప్లిమెర్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి షాకిచ్చింది. మూడు బాల్స్‌‌‌‌ తేడాలో రెండు వికెట్లు పడటంతో కివీస్‌‌‌‌ స్కోరు 67/2గా మారింది. 

ఈ దశలో డివైన్‌‌‌‌ నిలకడగా ఆడింది. ఇండియా పేస్‌‌‌‌–స్పిన్‌‌‌‌ను దీటుగా ఎదుర్కొన్న డివైన్‌‌‌‌ అవసరమైనప్పుడల్లా ఫోర్లతో రెచ్చిపోయింది. దీంతో రన్‌‌‌‌రేట్‌‌‌‌ తగ్గకుండా చూసింది. రెండో ఎండ్‌‌‌‌లో అమెలియా కెర్ (13)ను ఔట్‌‌‌‌ చేసిన రేణుకా సింగ్‌‌‌‌ (2/27) మూడో వికెట్‌‌‌‌కు 32 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేసింది. తర్వాత వచ్చిన బ్రూక్‌‌‌‌ హాలీడే (16) వేగంగా ఆడి నాలుగో వికెట్‌‌‌‌కు 46 రన్స్‌‌‌‌ జోడించింది. ఈ క్రమంలో డివైన్‌‌‌‌ 32 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేసింది. చివర్లో మ్యాడి గ్రీన్‌‌‌‌ (5 నాటౌట్‌‌‌‌)తో ఐదో వికెట్‌‌‌‌కు 15 రన్స్‌‌‌‌ జత చేయడంతో కివీస్‌‌‌‌ మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది. 

పెవిలియన్‌‌‌‌కు క్యూ..

లక్ష్య ఛేదనలో ఇండియాకు ఏదీ కలిసి రాలేదు. కివీస్‌‌‌‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో ఇండియన్‌‌‌‌ ప్లేయర్లు పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు. రెండో ఓవర్‌‌‌‌లోనే షెఫాలీ (2) ఔట్‌‌‌‌కావడంతో మొదలైన వికెట్ల పతనం వేగంగా సాగింది. స్మృతి మంధాన (12), కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ (15) ఇన్నింగ్స్‌‌‌‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా ప్రత్యర్థి బౌలర్లు చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. ఆరు బాల్స్‌‌‌‌ తేడాలో ఈ ఇద్దరూ ఔట్‌‌‌‌ కావడంతో ఇండియా 42/3 స్కోరుతో కష్టాల్లో పడింది. పవర్‌‌‌‌ప్లేలో 43/3 స్కోరు చేసిన హర్మన్‌‌‌‌సేన  ఇన్నింగ్స్‌‌‌‌ ఆ తర్వాత మరింత తడబడింది. మిడిలార్డర్‌‌‌‌లో జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌ (13), రిచా ఘోష్‌‌‌‌ (12), దీప్తి శర్మ (13) పోరాటంసరిపోలేదు. వరుస విరామాల్లో ఈ ముగ్గురితో పాటు అరుంధతి రెడ్డి (1) కూడా ఔట్‌‌‌‌కావడంతో ఇండియా 88/7తో వెనకబడిపోయింది. చివర్లో పూజా వస్త్రాకర్‌‌‌‌ (8), శ్రేయాంక పాటిల్‌‌‌‌ (7), ఆశా శోభన (6 నాటౌట్‌‌‌‌), రేణుకా సింగ్‌‌‌‌ (0) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితం కావడంతో ఇండియా విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. 

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌‌‌‌: 20 ఓవర్లలో 160/4 (డివైన్‌‌‌‌ 57 నాటౌట్‌, ప్లిమెర్‌‌‌‌ 34, రేణుక 2/27). 
ఇండియా: 19 ఓవర్లలో 102 ఆలౌట్‌‌‌‌ (హర్మన్‌‌‌‌ 15, మెయిర్‌‌‌‌ 4/19, తహుహు 3/15).