ఏడాది పాలనలో వికసించిన మహిళా సాధికారత

తెలంగాణలో  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.  బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపు రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం రాష్ట్ర ప్రజలపై పడింది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి గత సంవత్సరం డిసెంబర్ 7న రాష్ట్ర అధికార పగ్గాలను చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముందుకు వెళుతున్నారు.  పక్కా ప్రణాళికతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రేవంత్​ సర్కారు అడుగులు వేస్తోంది. మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోంది. అన్ని రంగాల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తోంది. సామాజిక భద్రత, సాధికారత, స్వయం ఉపాధి, మాతాశిశు సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.

గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి  చేసిందేమీ లేదు. కానీ, అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టి తన మార్క్ పాలనను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నవంబర్ 17, 2024 నాటికి ఆర్టీసీ బస్సుల్లో 109.80 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణించగా ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం రూ. 3,710.22 కోట్లను చెల్లించింది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక చేయూతనిచ్చే ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ రూ. 500లను 43 లక్షల లబ్ధిదారులకు అందజేస్తోంది.  గృహజ్యోతి కింద రాష్ట్రవ్యాప్తంగా 49,54,834 కుటుంబాలు లబ్ధి పొందగా రూ.1,336 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. అలాగే ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు, రాష్ట్ర వ్యాప్తంగా 150 ఇందిరా మహిళా శక్తి  భవనాలు, 57,512 సంఘాలకు రూ.1,747 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాకుండా సెర్ప్​ద్వారా కోటిమంది మహిళలను  కోటీశ్వరులను చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది.  ఎస్.హెచ్.జి  గ్రూపులకు  స్త్రీ నిధి ద్వారా రుణాలు 1,91,154 సభ్యులకు రూ.1747 కోట్ల రుణాలు  ఇస్తూ ఆర్థిక చేయూతను ఇస్తోంది. 

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు

ఇల్లు లేని నిరుపేదలకి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నియోజకవర్గానికి 3,500 ఇండ్లను రాబోయే కాలంలో కేటాయించి గూడు లేని పేదలకు నీడను కల్పించనుంది. అంతేగాక రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 22 లక్షల రైతు కుటుంబాలకు రూ.20వేల కోట్లకు పైగా మూడు విడతలుగా రుణమాఫీ చేసింది.  రాష్ట్రానికి ప్రతి నెలా రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుంటే,  గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులపై వడ్డీ కింద మరో రూ.6,500 కోట్లు చెల్లిస్తోంది.  కాళేశ్వరం పేరిట గత ప్రభుత్వం నిధులు మింగి మీసాలు దిద్దింది.నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వాడకుండానే 66.77 లక్షల ఎకరాలు వరి సాగవుతోంది. గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగుల ఆశలు అడియాశ లయ్యాయి. ఏ నోటిఫికేషన్ వచ్చినా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.  ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. ఎన్ని అవకతవకలు జరుగుతున్నా టీజీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బోర్డుని ప్రక్షాళన చేసి వరుసగా నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. తొలి ఏడాదిలోనే 60000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి సీఎం తన మాట నిలుపుకున్నారు. 

విద్యార్థుల భవిష్యత్​కు భరోసా

బీఆర్ఎస్​ పాలనలో ఒక్కసారి మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 7857 పోస్టులను భర్తీ చేయగా సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 11,062 పోస్టులను భర్తీ చేసిందంటే నిరుద్యోగులపై ఉన్న దృక్పథం అర్థం అవుతుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి విదార్థుల్లో నైపుణ్యాన్ని పెంచుతున్నారు. గత పాలనలో రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీలోనూపూర్తికాల వీసీల  నియామకాలను  చేపట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ తొలి ఏడాదిలోనే వీసీల నియామకాలను చేపట్టి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాను ఇస్తోంది. 

ఆరోగ్యానికి ప్రాధాన్యం

పేదల వైద్యం విషయంలో కూడా బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. పేద, మధ్య తరగతి ప్రజలు జబ్బు బారిన పడితే అప్పులపాలు కాకుండా ఆరోగ్య శ్రీని రూ.10లక్షలకు పెంచి ఆరోగ్య భరోసా ఇస్తోంది. 8 మెడికల్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీల ఏర్పాటు, నిమ్స్ హాస్పిటల్లో అన్ని వైద్యసేవలకు ఆరోగ్య శ్రీ వర్తింపు,  గాంధీ ఆస్పత్రిలో  ఐ.వీ.ఎఫ్, రీజనల్ సెంటర్ల ఏర్పాటు, డిజిటల్ హెల్త్ కార్డ్స్, పెండింగ్ బిల్లులు విడుదల ఇలా 8 నెలల కాలంలోనే వైద్యశాఖలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. 

రేవంత్​ మార్క్​

దేశానికే తెలంగాణ రోల్ మోడల్​గా  నిలిచేలా  రేవంత్​ సర్కార్​ కుల గణన చేపడుతోంది. కులగణన, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ అమలులాంటి  చారిత్రక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.  హైడ్రాతో చెరువులను, నీటివనరులను  కబ్జా చేసిన వారి గుండెల్లో నిద్రపోతున్నారు. చెరువులకు పూర్వవైభవం తెస్తున్నారు. మూసీ నది ప్రక్షాళనకు పూనుకుని హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తేనున్నారు. రానున్న కాలంలో తెలంగాణ సబ్బండ వర్గాలు ఆర్థిక ఉన్నతి సాధించేలా పక్కా ప్రణాళికతో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించనున్నారు.

- ఇందిరా శోభన్,
కాంగ్రెస్ సీనియర్
నాయకురాలు