తిరుపతి నగరంలో నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది. మహిళలకు మత్తు మందు ఇచ్చి దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణపురానికి చెందిన పద్మజ అనే బాధితురాలు ఉదయమే వచ్చి ఫిర్యాదు చేయడంతో చోరీ వ్యవహారం బయటపడింది. ఆరోగ్యానికి శక్తినిచ్చే టాబ్లెట్ అంటూ మహిళలను నమ్మించి లాడ్జీకి తీసుకెళ్లి మత్తు బిల్లలు తినిపించాడు. మహిళలు స్పృహ కోల్పోయాక వారి ఒంటిపై ఉన్న నగలు తీసుకుని ఉడాయించాడు. 322 గ్రాముల బంగారం, 1 కిలో వెండి, 70 వేల నగదు తీసుకుని పరారైనట్లు పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
