పేరెంట్స్​ను చూసొస్తానని వచ్చి.. భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య

గద్వాల/శాంతినగర్, వెలుగు: ఇన్​స్టాలో పరిచయం ..ఆపై ప్రేమపెళ్లి చేసుకొని.. ఇప్పుడు కాదంటున్నాడని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు భార్య బైఠాయించింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పరిధిలోని మానవపాడు మండలం ఏ బుడిదపాడులో సోమవారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. ఏపీకి చెందిన నిహారికను ఏ బుడిదపాడుకు చెందిన బషీర్ కు ఇన్​స్టాగ్రామ్ లో పరిచయం చేసుకున్నాడు. ఆపై ఆమెను ప్రేమించి గత మార్చి18న పెళ్లి చేసుకోగా పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో శాంతినగర్ పోలీసులను ఆశ్రయించారు. 

మేజర్లను ఇబ్బందులు పెట్టొద్దని పెద్దలకు చెప్పడంతో దంపతులు ఏపీకి వెళ్లి కాపురం పెట్టారు. ఆ తర్వాత పేరెంట్స్​ను చూసి వస్తానని వెళ్లిన బషీర్ మళ్లీ తిరిగి రాలేదు. దీంతో సోమవారం బక్రీద్ సందర్భంగా బషీర్ ఇంటికి యువతి వెళ్లగా.. రావద్దంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నిహారిక ఆరోపిస్తూ ఇంటి ముందు బైఠాయించింది. 

తనకు న్యాయం చేయాలని కోరితే.. శాంతినగర్ ఎస్ఐ పట్టించుకోవడంలేదని, దీంతో డీఎస్పీ, ఎస్పీకి కంప్లైంట్ చేసినట్లు ఆమె చెప్పింది. శాంతినగర్ ఎస్ఐ సంతోష్ ను వివరణ కోరగా.. నాలుగు నెలలుగా పంచాయితీ నడుస్తోందని.. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పినా కంప్లైంట్​ ఇవ్వలేదన్నారు. కేసు పెట్టకుండా న్యాయం చేయాలంటే కుదరదని చెప్పడంతో, తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎస్ఐ చెప్పారు.