- రూ.26 లక్షలు కొట్టేసినట్లు నిర్ధారణ..
పాల్ఘర్: పోలీసులకు పట్టుపడిన దొంగ సొత్తును ఎవరికీ అనుమానం రాని రీతిలో గుట్ట చప్పుడు కాకుండా చిలక్కొట్టుడు కొడుతున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఎట్టకేలకు దొరికిపోయింది. ఓ స్క్రాప్ డీలర్ తో కుమ్ముక్కయిన మహిళా కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్ వాసాయ్ చేతివాటం ప్రదర్శిస్తూ సొంత పోలీసుల నిఘాలో దొరికిపోయింది. పాల్ఘర్ జిల్లాలోని వాసాయి పోలీసు స్టేషన్ పరధిలో దొంగతనాల కేసుల్లో రికవరీ చేసిన వస్తువుల విషయంలో మోసాలకు పాల్పడినట్లు తేలడంతో మహిళా కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్ ని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
వాసాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనాల కేసుల్లో రికవరీ చేసిన వస్తువులకు మహిళా కానిస్టేబుల్ మంగల్ గైక్వాడ్ ఇంచార్జ్ గా ఉండే వారు. పట్టుపడిన దొంగ సొత్తును ఓ స్క్రాప్ డీలర్ సహాయంతో మాయం చేయడం మొదలుపెట్టింది. గత ఆరేళ్లుగా ఈ తంతు నిరాటంకంగా జరిగింది. ఇటీవల అనుమానం రావడంతో నిఘా పెట్టిన పోలీసులకు ఇంటి దొంగ దొరికిపోయింది. పోలీసులు ఆడిట్ నిర్వహించగా ఆరేళ్లలో రూ. 26 లక్షల వరకు మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దొంగతనాల కేసుల్లో రికవరీ చేసుకున్న వస్తువులను దొంగిలించి సొమ్ము చేసుకున్నట్లు తేలిందని సీనియర్ ఇన్‌స్పెక్టర్ కళ్యాణ్ కార్పే తెలిపారు.
