ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్..  మహిళా మావోయిస్టు మృతి

భద్రాచలం: ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్​కౌంటర్ లో మహిళా మావోయిస్టు హతమైంది. కాంకేర్​జిల్లా చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బీనాగుండా అడవుల్లో డీఆర్జీ, బీఎస్ఎఫ్​ జవాన్లు కూంబింగ్​కు వెళ్లారు. ఐదు రోజుల క్రితం ఈ ప్రాంతంలో మావోయిస్టులు రోడ్డు నిర్మాణంలో ఉన్న మూడు ట్రాక్టర్లు, జేసీబీ, లోడర్లను తగులబెట్టారు. దీనితో పనులు నిలిచిపోయాయి. ఈ ఘటనతో ఐజీ పి.సుందర్​రాజ్​ఆధ్వర్యంలో డీఆర్జీ, బీఎస్ఎఫ్​ జవాన్లు కూంబింగ్​చేపట్టాయి. ఆదివారం రాత్రే బలగాలు అడవుల్లోకి వెళ్లగా ఎటువంటి దళాలు కన్పించలేదు. సోమవారం ఉదయం బలగాలు తిరిగి వస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. సుమారు అరగంట సేపు కాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుకుంటూ మావోయిస్టులు పారిపోయారు. సంఘటనా ప్రదేశంలో మహిళా మావోయిస్టు మృతదేహం, ఒక రైఫిల్​ దొరికాయి.