- టాప్ 3 ర్యాంకులు మహిళలకే!
- యూపీకి చెందిన శృతి శర్మకు ఫస్ట్ ర్యాంక్
- మొత్తం 685 మంది ఎంపిక
- టాప్ 25లో 9 మంది మహిళలు
- 23 మంది దివ్యాంగుల ఎంపిక
- సివిల్స్‌కు అప్లై చేసిన 10.93 లక్షల మంది
న్యూఢిల్లీ: సివిల్స్‌లో మహిళలు మెరిశారు. టాప్3 ర్యాంకుల్లో వాళ్లే నిలిచారు. సోమవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ 2021 తుది ఫలితాలను విడుదల చేసింది.
మొత్తంగా 685 మంది ఎంపికవ్వగా.. అందులో 508 మంది మగవాళ్లు, 177 మంది మహిళలున్నారు. మొత్తంగా 685 మంది ఎంపికవ్వగా.. అందులో 508 మంది మగవాళ్లు, 177 మంది మహిళలున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శృతి శర్మ టాపర్‌గా నిలిచారు. ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ ఆనర్స్ చేసిన ఆమె.. సివిల్స్‌లో అదే సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. అంకిత అగర్వాల్ రెండో ర్యాంక్ సాధించగా.. గామిని సింగ్లా మూడో ర్యాంకును దక్కించుకుని సత్తా చాటారు. ఉత్కర్ష్ ద్వివేది ఐదో ర్యాంక్ సాధించారు. 23 మంది దివ్యాంగులూ సివిల్స్‌కు ఎంపికవ్వడం విశేషం. టాప్ 25 అభ్యర్థులంతా ఐఐటీ, ఎయిమ్స్, వీఐటీ, పీఈసీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, జీబీ పంత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివిన వారేనని యూపీఎస్సీ తెలిపింది. ఆంథ్రపాలజీ (మానవ శాస్త్రం), ఆర్థికశాస్త్రం, భౌగోళికశాస్త్రం, హిందీ సాహిత్యం, చరిత్ర, గణితం, మెడికల్ సైన్సెస్, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు, ప్రభుత్వ కార్యనిర్వహణ, సోషియాలజీ, జీవశాస్త్రం వంటి సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకున్నారని పేర్కొంది. మొత్తంగా ఎంపికైన అభ్యర్థుల్లో 244 మంది ఓసీలు కాగా.. 73 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గం వాళ్లు, 203 మంది ఓబీసీలు, 105 మంది ఎస్సీలు, 60 మంది ఎస్టీలున్నట్టు వెల్లడించింది. ఫలితాల్లో అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నవాళ్లు 23385271, 23381125, 23098543 ఫోన్ నెంబర్లకు కాల్ చేయవచ్చని యూపీఎస్సీ సూచించింది. 15 రోజుల్లోగా అభ్యర్థుల మార్కులను www.upsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. సివిల్స్ సాధించిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలు శుభాకాంక్షలు చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న ఇలాంటి శుభ తరుణంలో సివిల్ సర్వీసెస్ సాధించిన యువతకు శుభాభినందనలు అని ప్రధాని మోడీ చెప్పారు. సివిల్స్ రాని వాళ్ల బాధను తాను అర్థం చేసుకోగలనని, కానీ వాళ్లంతా కూడా తమతమ కెరీర్లలో దేశాన్ని గర్వించేలా చేయగలరని ఆయన అన్నారు. టాప్ 3 ర్యాంకులను మహిళలే సాధించడం సంతోషంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
టాప్ టెన్ వీళ్లే..
శృతి శర్మ, అంకిత అగర్వాల్, గామిని సింగ్లా, ఐశ్వర్య వర్మ, ఉత్కర్ష్ ద్వివేది, యక్ష్ చౌదరీ, సమ్యక్ఎస్. జైన్, ఇషిత రాఠీ, ప్రీతమ్ కుమార్, హర్కీరత్ సింగ్ రంధావా
