ఆరతి ఎంత పని చేశావమ్మా..!: మరో ప్రాణం తీసిన లోన్ యాప్ నిర్వాహకులు

లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు మరో ప్రాణం పోయింది. నిర్వాహకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయనే భయంతో ఎర్నాకులంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పడక గదిలోనే ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించింది. మృతురాలు కురియప్పురం ఆరతి(31)గా గుర్తించారు. 

భర్త విదేశాల్లో.. 

ఎర్నాకులం, పెరుంబవూరుకు చెందిన అనీష్, ఆరతి భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు దేవదత్, దేవసూర్య. మహిళ భర్త సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దినెలల క్రితం ఆరతి ఇంటి అవసరాల కోసం ఓ లోన్ యాప్‌లో కొంత డబ్బు రుణంగా తీసుకుంది. ఆ మొత్తాన్నిఆమె సకాలంలో చెల్లించకపోవడంతో..  నిర్వాహకులు వడ్డీ మీద వడ్డీ వేసి లక్ష దాటించారు. చివరకు ఆ మొత్తాన్ని చెల్లించాలంటూ ఆమెకు ఫోన్లు చేసి వేధించడం మొదలుపెట్టారు.

చెల్లించేందుకు ఆమె కొంత సమయం గడువు కోరినప్పటికీ నిర్వాహకులు అంగీకరించలేదు. రెండ్రోజుల్లోపు కట్టకపోతే.. ఫోన్లో ఉన్న నంబర్లన్నింటికీ కాల్ చేస్తామని బెదిరించారు. అదే జరిగితే కుటుంబం పరువు పోతుందని భావించిన మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

ఆరతి ఎంత పని చేశావమ్మా..!

తల్లి శవం ముందు కూర్చొని ఇద్దరు పిల్లలు రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. వృద్ధులైన ఆమె అత్తమామలను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. భర్త విదేశాల నుంచి స్వగ్రామానికి చేరుకున్నాక ఆమె అంతయక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై కురుప్పంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.