హెర్బల్​మెడిసిన్ వికటించి మహిళ మృతి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

నర్సంపేట/వరంగల్​సిటీ వెలుగు: హెర్బల్​మెడిసిన్ వికటించి మహిళ చనిపోయిన ఘటన వరంగల్​జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. బాధిత కుటుంబ సభ్యులు, రాష్ట్ర  వైద్య మండలి పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేశ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారావుపేట మండలం బోజెర్వుకు చెందిన ఎం. యాదలక్ష్మి(40) భర్తతో విడిపోయి కొడుకుతో పుట్టింట్లో ఉంటోంది. కొన్నేండ్లుగా ఆమె మూర్చ వ్యాధితో బాధపడుతూ అల్లోపతి ట్రీట్​మెంట్​తీసుకుంటోంది. కాగా.. కవిత అనే మహిళ హెర్బల్​ట్రీట్​మెంట్​తీసుకుంటే మూర్చ వ్యాధి తగ్గుతుందని చెప్పడంతో నమ్మింది. గత నెల16న యాదలక్ష్మి రూ. 3 వేలు చెల్లించి పేరులేని మెడిసిన్ కవిత వద్ద కొనుగోలు చేసింది. 

అల్లోపతి మందులను ఆపేసి.. హెర్బల్ మెడిసిన్ వాడుతోంది. ఈనెల19న యాదలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. బంధువులు ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్ బాలరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. గౌతమ్, కిడ్నీ స్పెషలిస్ట్ డా. బొట్టు మల్లేశ్వర్, పీజీ డా. తిరుపతి టీమ్ టెస్ట్ లు చేసి చికిత్స అందిస్తున్నారు. మూర్చవ్యాధి తిరగబెట్టడంతో పాటు పేరు లేని హెర్బల్ మెడిసిన్ వాడడంతో ఆమె కిడ్నీ, లివర్ దెబ్బతిని పరిస్థితి సీరియస్ అయిందని డాక్టర్ల టీమ్ నిర్ధారించి గురువారం చెన్నారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ యాదలక్ష్మి మృతిచెందింది.