గన్తో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ మృతి

అన్నమయ్య జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి(26) అనే మహిళా కానిస్టేబుల్ గన్నుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేదవతి మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 వేదవతి భర్త దస్తగిరితో కలిసి రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహకు సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటోంది. వేదవతి సొంత ఊరు పుంగనూరు దగ్గర బింగానిపల్లె. ఆమె భర్త సొంత ఊరు మదనపల్లి.  దస్తగిరి.. పుంగనూరులో పోలీస్ అకాడమీ కోచింగ్ సెంటర్ లో ప్యాకల్టీగా పనిచేస్తున్న సమయంలో అక్కడ వేదవతి ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఇద్దరు ప్రేమించుకుని 2016 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. 

వేదవతి చిత్తూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తూ సంవత్సర క్రితం బదిలీపై అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి హత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె గన్ను తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా? లేక గన్ మిస్ ఫైయిర్ అయి మృతి చెందిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.