ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి

ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి

ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడికి దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై యాసిడ్ పోసింది.ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు మరో యువతిని పెళ్లాడటంతో అతనిపై దాడికి దిగింది. ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన రాకేష్, కాంచీపురానికి చెందిన జయంతి రెండేళ్లు దుబాయ్ లో ఉన్నారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ప్రేమించుకున్నారు. తిరిగి ఆరు నెలల క్రితం స్వస్థలానికి తిరిగి వచ్చారు. 

అయితే రాకేశ్ జయంతికి తెలియకుండా... మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె రాకేశ్ కు ఫోన్ చేసి నిలదీసింది. ఫోన్లోనే గొడవపడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కోయంబత్తూరు పీలమేడు ప్రాంతంలో ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మాటామాటా పెరగడంతో జయంతి కోపంతో రాకేశ్ పై దాడికి దిగింది. అప్పటికీ వెంట తెచ్చుకున్న యాసిడ్ రాకేశ్ పై పోసింది.ఆ తర్వాత కత్తితో దాడి చేసింది. అనంతరం ఆమె కూడా నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. 

ఇద్దరూ అచేతనంగా పడి ఉండగా పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు కోయంబత్తూరు మెడికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాకేశ్ తన వద్ద నుంచి 18 లక్షలు తీసుకున్నాడని జయంతి పోలీసులకు తెలిపింది. ఈ ఘటనలో రాకేశ్ స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇద్దర్ని విచారించిన విన్న పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.