న్యూఢిల్లీ, వెలుగు: కొత్త సంస్కరణలతో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచిందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు గుజరాత్ అన్ని అవార్డులు పొందేదని, ఇప్పుడు ఆ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. ఎలాంటి సహకారం లేకపోతేనే తెలంగాణ ఈ స్థాయికి చేరిందని, కేంద్ర సహకారం అందితే మరింత ప్రగతి పథంలోకి వెళ్తుందన్నారు. మంగళవారం లోక్ సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా టీఆర్ఎస్ తరఫున ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడారు. ‘సాత్ చలేంగే, సాత్ చర్చ కరేంగే’ అని ప్రధాని రాజ్యసభలో చెప్పారని, తాము సైతం అదే కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకానికి రూ. 25 వేల కోట్లు ఎందుకు తగ్గించారో చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంలో రాష్ట్ర జీఎస్ డీపీ రూ. 4.5 లక్షల కోట్లని, ఇప్పుడు రూ. 9.8 లక్షలుగా ఉందన్నారు. దాదాపు 93 శాతం పెరిగిందని చెప్పారు. గడిచిన 8 ఏండ్లలో ట్యాక్సుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం 3.65 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. కానీ, రాష్ట్రానికి రూ. లక్షా 85 వేల కోట్లు మాత్రమే కేంద్రం తిరిగి ఇచ్చిందన్నారు.
