అమరావతి, వెలుగు: బందరు పోర్టును తెలంగాణకు ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. బందరు పోర్టు అభివృద్ధి, నిర్వహణ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ కు అప్పగించేలా కుట్ర చేస్తున్నారన్నారు. ఈ మేరకు జూన్ 28న ఆర్టీ 62 నంబరుతో రాష్ర్ట ప్రభుత్వం రహస్య జీవో కూడా ఇచ్చిందంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో అడిగితే పోర్టును తెలంగాణకు ఇవ్వడం లేదని జగన్ ప్రభుత్వం బుకాయిస్తోందన్నారు. రహస్య జీవోపై రెండు రోజుల్లో మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు. రాష్ర్టంలో ఉన్న పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకుడి స్నేహాలకు, సొంత లాలూచీలకు ఏపీ ఆస్తులను తెలంగాణకు ఇస్తామంటే టీడీపీ సహించదన్నారు.
పాలన చేతకాదని కేసీఆర్ కు ఇస్తారా?: లోకేశ్
బందరు పోర్టు అభివృద్ధి చేసే పరిస్థితి లేదన్న కారణంతో ఏపీ ప్రభుత్వం పోర్టును తెలంగాణకు అప్పగిస్తే… రేపు పాలన చేతకాదని రాష్ర్టాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారా అని మాజీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. పరిపాలన, అభివృద్ధి చేయలేని అసమర్థులు ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నికల్లో ఎందుకు అడిగారని ట్విటర్ లో మండిపడ్డారు. అధికారం దక్కించుకున్నది దోచుకోవడానికా లేక ఆంధ్రా ప్రజల భవిష్యత్‌ను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టడానికా అంటూ విమర్శించారు.
