రాజ్యాంగాన్ని రక్షిస్తం .. రిజర్వేషన్లను పెంచుతం : రాహుల్ గాంధీ

హైదరాబాద్: అణగారిన వర్గాలు, పేదలకు రాజ్యాంగం అండగా ఉందని, ఆ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఎందరో త్యాగాల ఫలితంగా రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ  రక్షిస్తుందని అన్నారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని చెబుతున్నారని, ఈ ఎన్నికలు రెండు అలయన్స్ ల మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఒకటి రాజ్యాంగాన్ని రక్షించే ఇండియా సమూహమని, రెండోది రాజ్యాంగాన్ని మార్చేయాలనుకునే ఎన్డీఏ అని అన్నారు. ప్రాథమిక హక్కులన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే లభించాయని, అలాంటి రాజ్యాంగాన్ని మార్చితే తాము ఊరుకోబోమని అన్నారు. 

మోదీ 25 మంది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, ఇందులో భాగంగానే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. ‘దేశంలో యాభై శాతం మంది ఓబీసీలు, 15 దళితులు 8 ఆదివాసీలున్నారు. 15మైనార్టీలు, 8శాతం జనరల్ కేటగిరీ ఉన్నారు. వీరందరిని కలిపితే 90 శాతానికి సమాధానం అవుతారు. వీళ్లందరికీ పాలనలో భాగస్వామ్యం లేదు. తెలంగాణలో జరుగుతున్నట్టు దేశవ్యాప్తంగా కులగణన చేపడుతాం.. కులగణన తర్వాత ఉజ్వల రాజకీయ చైతన్యం వస్తుందని చెప్పారు. 

రెండు మూడు శాతం ఉన్నవాళ్లు దేశాన్ని నడిపిస్తున్నారు. వాళ్ల చేతుల్లోనే సంపద ఉంది.. వాళ్లే దేశాన్ని శాసిస్తున్నారు. మేం అధికారంలోకి రాగానే రాజకీయ స్వరూపాన్ని మార్చేస్తాం. అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తం. ఒక చరిత్రాత్మక కార్యక్రమానికి మేం శ్రీకారం చుట్టబోతున్నం.. మీరు దానికి కలలో కూడా ఊహించి ఉండరు. దేశంలోని పేదల జాబితా తయారు చేస్తం.. ఇందుకోసం తెలంగాణలో ప్రతి గ్రామానికి వెళ్తాం.. రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీల లిస్ట్ తయారు చేస్తం.. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పేరు ఎంపిక చేస్తాం..ఆ మహిళ ఖాతాలో రూ లక్ష వేస్తాం.. ఇలా ప్రతి నెలా రూ. 8,500 చొప్పున జమ చేస్తం
 

అదాని కోసమే నోట్ల రద్దు 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నారని, ఆయన కోసమే నోట్ల  రద్దు చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘జూన్ 7న ఢిల్లీలో ఇండియా కూటమి ప్రభుత్వం  ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ‘నేను కొత్త పథకం తో వస్తున్నాను. మోదీ ఇవ్వకుండా వదిలేసిన 30 లక్షల ఉద్యోగాలను ఆగస్టు 15 కల్లా ఇచ్చేస్తాం, మోదీ కోటీశ్వరుల అప్పులు మాత్రమే మాఫీ చేశారు. మేం రైతుల రుణాలను మాఫీ చేస్తం.. పంటలకు ఎంఎస్పీ ఇస్తం..’ అని రాహుల్ గాంధీ అన్నారు.  

మెదక్ జిల్లాలో మొనగాడే దొర్కలే


నీలం మధు మీద పోటీకి కరీంనగర్ జిల్లా నుంచి వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారని, మెదక్ జిల్లాలో పోటీ  చేసే మొనగాడే దొర్కలేదా..? అని సీఎం రేవంత్  రెడ్డి కేసీఆర్ ను  ప్రశ్నించారు. ఇవాళ నర్సాపూర్ సభలో ఆయన మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ కోసం రైతుల భూము గుంజుకున్నోడు వెంకట్రామిరెడ్డిని  నిలబెట్టారని అన్నారు. భూ నిర్వాసితులను లాఠీలతో కొట్టించిన వెంకట్రామిరెడ్డిని ఓడించాలని సీఎం పిలుపునిచ్చారు. ‘కేసీఆర్ వయస్సు మీద పడ్డది ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో.. నీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతైతది.. నర్సాపూర్ నుంచే అది మొదలైతది.’ అని సీఎం అన్నారు. దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టిన  రఘునందన్ రావే ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని ఆయనను ఓడించాలని అన్నారు.‘ దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగాళ్లలా రాముడిని హనుమంతుడిని వాడుకుంటున్రు..’ ఆ పార్టీ వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని సీఎం పిలుపునిచ్చారు.