చండీగఢ్: హర్యానా బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. తమ నేత మనీశ్ గ్రోవర్ జోలికొస్తే కళ్లు పీకేస్తానని, చేతులు నరికేస్తానని హెచ్చరించారు. బీజేపీ లీడర్ మనీశ్ గ్రోవర్ శుక్రవారం రోహ్‌తక్ జిల్లాలోని కిలోయ్ గ్రామంలో ఉన్న ఆలయానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఆయనను ఘెరావ్ చేశారు. దాదాపు 8 గంటల పాటు గ్రోవర్‌తో పాటు మినిస్టర్ రవీంద్ర రాజు, రోహ్‌తక్ మేయర్ తదితరులను గుడిలో నిర్బంధించారు. వ్యవసాయ చట్టాలకు నిరసగా ఏడాదిగా ఆందోళన చేస్తున్న రైతులపై గ్రోవర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆందోళన చేసే వారంతా ‘‘పనీపాటా లేనీ తాగుబోతులంటూ’’ కామెంట్ చేశారు. గ్రోవర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆయన్ను గుడిలో నిర్బంధించారు. గ్రోవర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి ఆయన నిరాకరించారు. అయితే రైతులు గ్రోవర్ ను గుడిలో ఉంచి తాళం వేయడంపై ఎంపీ అరవింద్ శనివారం మండిపడ్డారు.
