గద్వాల జిల్లాలో చేపల టెండర్ ఖరారయ్యేనా?

  • ముచ్చటగా మూడోసారి టెండర్లు
  • టెక్నికల్  బిడ్  ఓపెన్, పోటీలో రెండు ఏజెన్సీలు
  • ఇంకా టెండర్​ ఖరారు కాలే..

గద్వాల, వెలుగు:జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు ఇప్పటి వరకు రెండుసార్లు టెండర్లు వేసినా ఎవరు పాల్గొనలేదు. మూడోసారి ఈ నెల13న టెండర్లు పిలవడంతో ముగ్గురు టెండర్లు వేశారు. శివగామి, రాజా ఫిషరీస్, ప్రకాశ్  టెండర్లు వేశారు. బుధవారం టెండర్లకు సంబంధించి టెక్నికల్  బిడ్​ ఓపెన్  చేయడంతో శివగామి, రాజా ఫిషరీస్  సొసైటీలు చేపల టెండర్ కు అర్హతలు ఉన్నట్లు ఆఫీసర్లు తేల్చారు. ప్రకాశ్​ అనే వ్యక్తికి అర్హత లేకపోవడంతో ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారైనా టెండర్లు ఖరారు చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముచ్చటగా మూడోసారి..

జోగులాంబ గద్వాల జిల్లాలోని 481 చెరువులతో పాటు రిజర్వాయర్లలో చేప పిల్లలు వదలాల్సి ఉంది. 1.78 కోట్ల చేప పిల్లలను ఉచితంగా మత్స్యకారులకు సప్లై చేసేందుకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది. 61 పైసలు విలువ చేసే 43.71 లక్షల 35 నుంచి 40 ఎంఎం చేప పిల్లలు, రూ.1.63 విలువ చేసే 1.34 కోట్ల 80 నుంచి 100 ఎంఎం సైజు చేప పిల్లలు సప్లై చేయాల్సి ఉంది. రూ.2 కోట్ల టెండర్  దాఖలుకు జులై 23న టెండర్  పిలిచారు. ఎవరూ పాల్గొనకపోవడంతో ఆగస్టు 2న రెండోసారి పిలిచారు. అప్పటికీ ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఈ నెల13న మరోసారి టెండర్  పిలవడంతో ముగ్గురు పోటీపడ్డారు. అందులో ఇద్దరు చేప పిల్లలను సప్లై చేసేందుకు అర్హత సాధించారు.

ఫైనాన్షియల్​ బిడ్  ఓపెన్  ఎప్పుడో?

చేప పిల్లలను సప్లై చేసేందుకు జిల్లా ఆఫీసర్లు టెండర్లను పిలిచారు. అర్హత కోసం టెక్నికల్  బిడ్  ఓపెన్  చేసినా, ఇంకా ఈ టెండర్లకు సంబంధించి ఫైనాన్షియల్​  బిడ్  ఓపెన్  చేయాల్సి ఉంది. ఇప్పటికే చెరువులు, రిజర్వాయర్లలో నీరు చేరింది. అయినా ఇప్పటివరకు టెండర్లు ఖరారు కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 

వాస్తవంగా బుధవారమే రెండు బిడ్స్  ఓపెన్  చేయాల్సి ఉన్నప్పటికీ.. టెక్నికల్  బిడ్  ఓపెన్  చేసి, ఫైనాన్షియల్  బిడ్  ఓపెన్  చేయకపోవడం ఏమిటని అంటున్నారు. చేప పిల్లల సప్లై వ్యవహారంలో ఓ పార్టీకి చెందిన నేత గత కొంతకాలంగా చక్రం తిప్పుతూ వస్తున్నాడు. ఈసారి కూడా టెండర్  ఆయనకే వచ్చేలా చూడాలనే ఉద్దేశంతో టెండర్లను ఓపెన్  చేయడంలో ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

క్వాంటిటీ అంతంతే..

లక్షల్లో చేప పిల్లలు సప్లై చేస్తుండడంతో ఒకసారి మాత్రమే లెక్క ప్రకారం ఇస్తూ.. మిగతా టైంలో ఇష్టానుసారంగా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఒక చెరువులో 50 వేల చేప పిల్లలు వదలాల్సి ఉండగా, 10 వేల పిల్లలు వదిలి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపణలున్నాయి. వీటికి ఆఫీసర్లతో పాటు మత్స్యకార సొసైటీలోని కొందరు సహకరిస్తున్నారని అంటున్నారు. ఈసారి పక్కాగా చేప పిల్లలను వదలాలని మత్స్యకారులు డిమాండ్  చేస్తున్నారు.

చేప పిల్లల పంపిణీకి టెండర్లు ఇంకా ఖరారు కాలేదు. ఫైనాన్షియల్  బిడ్  ఓపెన్  చేయాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో టెండర్లు ఖరారు అయ్యే ఛాన్స్  ఉంది. చేప పిల్లల లెక్క విషయంలో కూడా రాజీపడేది లేదు.

 షకీలా భాను, ఏడీ, ఫిషరీస్