కలిసే పోటీ .. ఇండియా కూటమి పార్టీల తీర్మానం

కలిసే పోటీ .. ఇండియా కూటమి పార్టీల తీర్మానం
  • 14 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు.. ఈ నెల 30 నాటికి సీట్ల పంపకాలు పూర్తి 
  • భారత్ ఏకమవుతుంది.. ఇండియా గెలుస్తుంది’ నినాదంతో ముందుకు.. 
  • ప్రజాసమస్యలపై దేశవ్యాప్తంగా ర్యాలీలు.. అలయెన్స్ లోగో విడుదల వాయిదా  
  • ముంబైలో ముగిసిన ప్రతిపక్షాల మూడో మీటింగ్ 

ముంబై:  ప్రతిపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఎదుర్కొనేందుకు కూటమిలోని పార్టీలన్నీ కలసికట్టుగా పోటీ చేయాలని తీర్మానించింది. ముంబైలో రెండ్రోజుల పాటు జరిగిన కూటమి మూడో మీటింగ్ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వీలైనంత వరకు కలిసే పోటీ చేయాలని కూటమిలోని పార్టీలు తీర్మానం చేశాయి. వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకాల ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని, అది వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అందులో పేర్కొన్నాయి. సీట్ల పంపకాల విషయంలో ఒకరికొకరం సహకరించుకుంటామని ప్రకటించాయి. 

ప్రజాసమస్యలతో పాటు ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తాం. ఇవి వీలైనంత తొందరగా ప్రారంభిస్తాం. ‘భారత్ ఏకమవుతుంది.. ఇండియా గెలుస్తుంది’ అనే థీమ్​తో అన్ని భాషల్లో ప్రచారం నిర్వహిస్తాం” అని చెప్పాయి. ఈ నెల 30 నాటికి సీట్ల పంపకాలను పూర్తి చేయనున్నట్టు కూటమి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ మీటింగ్​లో కూటమి లోగో విడుదల చేస్తారని, కన్వీనర్​ను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ రెండింటిపై నిర్ణయం తీసుకోలేదు. నాలుగైదు లోగోలు తయారు చేసినా పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీంతో లోగో విడుదలను వాయిదా వేశారు.  

ఈ మీటింగ్ లో ఇండియా’ కూటమి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కూటమిలోని అన్ని పార్టీలను సమన్వయం చేసేందుకు 14 మందితో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది కూటమి హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీగా వ్యవహరిస్తుందని పేర్కొంది. ఈ కమిటీ వెంటనే సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభిస్తుందని తెలిపింది. కమిటీలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ), తమిళనాడు సీఎం స్టాలిన్ (డీఎంకే), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (జేఎంఎం), రాఘవ్ చద్దా (ఆప్), జావెద్ అలీఖాన్ (ఎస్పీ), లలన్ సింగ్ (జేడీయూ), డి.రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) ఉన్నారు. కాగా, క్యాంపెయిన్స్, సోషల్ మీడియా నిర్వహణ కోసం మరో నాలుగు కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని మీటింగ్ లో నిర్ణయించారు. 

కూటమిలో భేదాభిప్రాయాలు.. 

‘ఇండియా’ కూటమిలో మొదటిసారి భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, దాన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు. తీర్మానాన్ని జేడీయూ, ఎస్పీ, ఆర్జేడీ ప్రవేశపెట్టగా.. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వ్యతిరేకించారు. కాగా, జులైలో జరిగిన కూటమి రెండో మీటింగ్ లో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని అన్ని పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. 

ఇస్రోకు అభినందనలు.. 

చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెబుతూ ‘ఇండియా’ కూటమి తీర్మానం ప్రవేశపెట్టింది. ‘‘ఇస్రో మన దేశం గర్వపడేలా ఎన్నో విజయాలు సాధించింది. చంద్రయాన్ 3 విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఇస్రో చేపడుతున్న ఆదిత్య ఎల్1 ప్రయోగం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇస్రో సాధిస్తున్న విజయాలు యువతలో సైన్స్ పై ఆసక్తిని పెంచేందుకు దోహదపడతాయి’’ అని అందులో పేర్కొంది. 

మీటింగ్ లో పాల్గొన్నది వీళ్లే.. 

మీటింగ్​లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, ఎస్పీ ప్రెసిడెంట్ అఖిలేశ్ యాదవ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్ ఎల్ డీ చీఫ్ జయంత్ చౌదరి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ ఎంఎల్) తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ కు ముందు కూటమి నేతలు గ్రూప్ ఫొటో దిగారు.