మామూలుగా చిట్టెలుక అంటే ఎలా ఉంటుంది? ఓ కలుగులో దాక్కుని, మనుషులు లేనప్పుడు ఇంట్లోకి, వంటింట్లోకి చొరబడి దొరికినవన్నీ తినేయాలి. తినేవి దొరక్కపోతే కనిపించనవన్నీ కొరికేయాలి. కబోర్డ్‌లోకి వెళ్లి బట్టలన్నీ చిందరవందరగా కొరికేయాలి. ఇల్లంతా కలియతిరిగి గందరగోళం సృష్టించాలి. అది కదా.. చిట్టెలుక నైజం! కానీ, ఈ చిట్టెలుక అలాంటిది కాదు. ఎలుకలందు ఈ చిట్టెలుక వేరయా! అనిపించుకుంటోంది. అలాగెందుకో ఇది చదవండి. తెలుస్తుంది.
వేల్స్ దేశానికి చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ రాడ్నీ హొల్బ్రూక్. ఆయన వయసు 75 ఏండ్లు. ఆయన ఒక షెడ్లో కెమెరాతోపాటు మిగతా టూల్స్ ఏవో పెట్టుకుంటాడు. అయితే, ఆ షెడ్లో ఆయన లేనప్పుడు ఎవరో ఆ రూమ్‌ని శుభ్రం చేస్తున్నారట. అదెవరా? అని కనిపెట్టడానికి ఒక వీడియో కెమెరా సెట్ చేశాడు. అందులో రికార్డ్ అయిన విజువల్స్ చూసి అవాక్కయ్యాడు. దాంట్లో ఆ చిట్టెలుక చేసే తతంగమంతా రికార్డ్ అయింది. దానికి అందినవి, మోయగలిగిన ఐటమ్స్ అన్నీ తెచ్చి ఒక చిన్న ట్రేలో వేస్తోంది. రోజూ ఆయన ఆ ట్రేలో నుంచి ఐటమ్స్ వాడేవాడు. కానీ పనయిపోయాక సర్దే టైం లేక వెళ్లిపోయి షెడ్‌కి లాక్ వేసేవాడు.
రాత్రుళ్లు ఆ చిట్టెలుక వచ్చి చిందరవందరగా ఉన్న వాటిని అన్నింటినీ నీట్‌గా సర్దిపెడుతోంది. అలా సర్దడం దానికి రొటీన్ అయిపోయింది. ఆ చిట్టెలుక ఒక్కరోజు కూడా మిస్ అయ్యేది కాదు. అంతేకాదు... రోజూ అదొక్కటే ఇవన్నీ చేసేది. కానీ, కొన్నిసార్లు తన ఫ్రెండ్స్‌ని కూడా తెచ్చుకుని ఈ పని చేయిస్తుందని చెప్తున్నాడు రాడ్నీ. గింజలు దాచడానికి అవసరమైన నెయిల్స్, కేబుల్ టైలు, చిన్న చిన్న వస్తువుల్ని ట్రేలో వేస్తున్నాయట అవి. అక్కడే పెట్టిన రాడ్నీ పాత షూలో పక్షుల కోసం పెట్టే ఫుడ్ అంతా ఆ చిట్టెలుక తినేస్తుందట. అయితే.. ‘2019లో ఇంగ్లాండ్‌లో ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. ఇన్నేండ్ల తర్వాత నాకు ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉంది’ అంటున్నాడు రాడ్నీ. మొత్తం మీద భలే పనిమంతురాలు ఈ చిట్టెలుక.
55 గంటల 15 నిమిషాలు..పంచ్‌లే పంచ్‌లు
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే తిరుగులేదు అంటారు. కానీ, మార్షల్ ఆర్ట్స్‌లోనే మాస్టర్స్ చేస్తే..? ఇంకేముంది గిన్నిస్ రికార్డ్ చేతికి వచ్చినట్టే! ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి? ఎందుకు? అంటే.. 42 ఏండ్ల సిధు క్షేత్రి అనే మార్షల్ ఆర్టిస్ట్ మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట. అయితే, తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునేందుకు గిన్నిస్ రికార్డ్ ఎంచుకున్నాడు. అందులో భాగంగా 55 గంటల,15 నిమిషాలు కంటిన్యూగా పంచింగ్ బ్యాగ్ మీద పంచ్‌లు కొట్టాడు.
ప్రతి రెండు సెకన్లకు ఒక పంచ్ ఇచ్చాడట. అలాగే గంటగంటకు కొంత టైం బ్రేక్ తీసుకోవచ్చు. కానీ, కేవలం 5 నిమిషాలు మాత్రమే బ్రేక్ తీసుకున్నాడు. అయితే 25 ఏండ్లుగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సిధు.. ‘దేశానికి నా వంతు భాగస్వామ్యాన్ని అందించాలని ఈ రికార్డ్ అంటెప్ట్ చేశా. అయితే 20 గంటలు కాగానే చేతుల్లో నొప్పి మొదలైంది. అది నా లిమిట్స్‌కి పరీక్షలా అనిపించింది. ఆ టైంలో ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని, నొప్పిని భరించాలనుకున్నా’ అని చెప్పాడు సిధు. అంతేకాదు.. దీనికంటే ముందు ఉన్న తన రికార్డ్‌ని ఇప్పుడు తనే ఐదు నిమిషాల తేడాతో బ్రేక్ చేశాడు.
ముక్కుతో..ఈల మారుమోగింది?!
ప్రోగ్రామ్స్ చూసేటప్పుడు, సినిమా థియేటర్స్‌లో విజిల్స్ వినిపిస్తుంటాయి. రెండు వేళ్లు నోట్లు పెట్టుకుని ఈల వేయడం అందరికీ తెలిసిందే. కానీ, ఓంటారియోలోని మిస్సిసాగాకు చెందిన లులు లోటస్ మాత్రం ముక్కుతో ఈల వేస్తుంది. ఆశ్చర్యపోయారా! నిజమే... అందరూ ఒకలా చేసే పనిని ఈమె వెరైటీగా చేస్తుందంటే నమ్మబుద్ధి కాదు. అయితే, విషయమేంటంటే... లులు ఏడేండ్ల వయసున్నప్పుడు ముక్కుతో ఈల వేయడం నేర్చుకుంది.
ఈల వేసేటప్పుడు ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండేవి కాదు. అందువల్ల ఎవరూ ఆమె ఈల వేస్తుందని గుర్తుపట్టేవాళ్లు కాదు. అప్పటి నుంచి ఇంట్లో, స్కూల్లో ముక్కుతో ఈల వేస్తూ అల్లరి చేసేది. ఇదొక ప్రత్యేకమైన టాలెంట్ అని గుర్తించిన ఆమె గిన్నిస్ రికార్డ్ కోసం ప్రయత్నించింది. అందులో ఆమె వేసిన విజిల్ 44.1 డెసిబల్స్ సౌండ్ రికార్డ్ అయింది. దాంతో ‘లౌడెస్ట్ నోస్ విజిల్ ఇన్ ద వరల్డ్’గా గిన్నిస్ రికార్డ్ సాధించింది. అయితే, తన రికార్డ్‌ను తనే బ్రేక్ చేయాలి అనుకుంటోంది. అంతేకాదు.. తన ఐదేండ్ల కొడుకు కూడా ఆమె అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. ఇప్పటికే ముక్కుతో ఈల వేయడం నేర్చుకున్నాడట!