భర్తను హత్య చేసేందుకు భార్య ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. తండ్రిని చంపేందుకు కొడుకులు యత్నం

  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కోదాడలో భర్తపై హత్యాయత్నం
  • రూ. 50 వేలు సుపారీ ఇచ్చిన మహిళ, నలుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆస్తి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం లేదని మొగుళ్లపల్లిలో తండ్రిపై కత్తితో కొడుకులు దాడి, సహకరించిన తల్లి 

కోదాడ, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ తన భర్తను హత్య చేయాలని ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసింది. ఇందుకోసం తన ప్రియుడితో కలిసి మరో ఇద్దరికి రూ. 50 వేలు సుపారీ ఇచ్చింది. చివరి నిమిషంలో స్థానికులు గమనించడంతో సదరు వ్యక్తి బతికి బయటపడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బాలేబోయిన ముత్తయ్య (వెంకయ్య), భార్య ధనలక్ష్మితో కలిసి ఆటోలో గ్రామగ్రామాన తిరుగుతూ పండ్లు అమ్ముకొని జీవిస్తున్నారు. ఇటీవల ముత్తయ్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో గుడిబండ గ్రామానికి చెందిన కొండ గోపి అనే ఆటోడ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పండ్లు అమ్మడం ప్రారంభించారు.

ఈ క్రమంలో ధనలక్ష్మికి, గోపికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిపిన ముత్తయ్య ధనలక్ష్మిని మందలించాడు. దీంతో తమకు అడ్డుగా ఉన్న ముత్తయ్యను హత్య చేయాలని ధనలక్ష్మి, గోపి ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో భాగంగా తొగర్రాయి గ్రామానికి చెందిన వీరబాబు, ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తులకు రూ. 50 వేలు సుపారీ ఇచ్చారు.

దీంతో వారిద్దరూ మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న ముత్తయ్య వద్దకు వచ్చి కండువాను మెడకు చుట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ముత్తయ్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రాగా నిందితులు పారిపోయారు. ముత్తయ్య రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. భర్త అడ్డు తొలగించుకునేందుకు ధనలక్ష్మే హత్యాయత్నం చేయిందని తేలడంతో ఆమెతో పాటు గోపి, వీరబాబు, నాగరాజును పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ఆస్తి కోసం తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకులు, సహకరించిన భార్య

మొగుళ్లపల్లి, వెలుగు : ఆస్తిని తమ పేరున రాయడం లేదంటూ ఇద్దరు కొడుకులు తండ్రిపై కత్తితో దాడి చేయగా, ఇందుకు భార్య కూడా సహకరించింది. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం బంగ్లాపల్లె గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన శాపారపు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భార్య కళ్యాణి, ముగ్గురు కొడుకులు భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బన్నీ ఉన్నారు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపాధి కోసం దూబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లి ఏడాదిన్నర కిందట తిరిగి గ్రామానికి వచ్చాడు.

అప్పటి నుంచి ఆస్తి విషయంలో కొడుకులు, తండ్రి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై నెల రోజుల కింద పోలీసులను ఆశ్రయించారు. గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో ఆస్తి పంపకాలు చేసుకున్నారు. తర్వాత ఆస్తిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని భార్య, కొడుకులు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పలుమార్లు అడిగినా దాట వేస్తూ వచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కళ్యాణి బుధవారం సాయంత్రం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కత్తితో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్న శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డుపైకి పరిగెత్తడంతో స్థానికులు గమనించి బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మండల కేంద్రానికి తీసుకొచ్చారు.

అక్కడి నుంచి అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిట్యాల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంజీఎంకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తల్లి రాధాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, కళ్యాణితో పాటు భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.