ఆస్తుల కోసం హత్యలు .. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలో వ్యక్తిని హత్య చేసిన భార్య, కూతురు

  • ఇంటి స్థలం విషయంలో గొడవపడి సూర్యాపేట జిల్లాలో తమ్ముడిని చంపిన అన్న

నాగర్‌‌కర్నూల్‌‌ టౌన్‌‌, వెలుగు : భూమి అమ్మొద్దని చెబుతున్నా వినడం లేదంటూ ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులే హత్య చేశారు. ఈ ఘటన నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లిలో శనివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (56) ఎల్లమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఐదుగురు కూతుళ్లు ఉండగా ఇద్దరికి పెండ్లిళ్లు అయ్యాయి. మరో ఇద్దరు హైదరాబాద్‌‌లో ఉంటుండగా, ఇంకో కూతురు గ్రామంలోనే తన అక్క వద్ద ఉంటోంది. ఈశ్వరయ్యకు సర్వే నంబర్‌‌ 300లో 2.14 ఎకరాల భూమి ఉంది.

 ఈ భూమి అమ్మి వచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కట్టుకోవడంతో పాటు కూతుళ్ల పెండ్లిళ్లు చేయాలని ఈశ్వరయ్య భావించాడు. అయితే భూమిని అమ్మొద్దంటూ భార్య ఎల్లమ్మ, బావమరిది బాలస్వామి, పెద్దకూతురు స్వాతి, పెద్ద అల్లుడు మల్లేశ్‌‌ ఈశ్వరయ్యకు చెప్పారు. అయినా అతడు వినకుండా భూమిని అమ్ముతానని స్పష్టం చేశాడు. దీంతో తమ మాట వినడం లేదంటూ నలుగురు కలిసి శుక్రవారం అర్ధరాత్రి ఈశ్వరయ్యను గొడ్డలితో నరికి హత్య చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం మధ్యాహ్నం అయినా ఈశ్వరయ్య బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంటి డోర్‌‌ తెరిచి చూడగా అతడు రక్తపుమడుగులో కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి చెల్లెలు విమల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తమ్ముడిని కొట్టి చంపిన అన్న 

గరిడేపల్లి, వెలుగు : ఇంటి స్థలం విషయంలో ఓ వ్యక్తి తన తండ్రితో కలిసి తమ్ముడిని హత్య చేశాడు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన నకిరేకంటి సంజీవ అలియాస్ ఘని (28) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కుటుంబ తగాదాలు, ఇంటి స్థలం విషయంలో శనివారం సంజీవకు అతడి అన్న అంజయ్య, తండ్రి నెహ్రూ మధ్య గొడవ జరిగింది. దీంతో అంజయ్య, నెహ్రూ కలిసి రోకలి బండతో సంజీవపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతడు స్పాట్‌‌లోనే చనిపోయాడు. సంజీవ భార్య అనిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ చరమందరాజు, ఎస్సై చలికంటి నరేశ్‌‌ చెప్పారు.