భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు

భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు
  • రాజస్థాన్ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టులో ఫిర్యాదు
  • మెయింటనెన్స్​ కింద నెలకు రూ.5 లక్షలు ఇప్పించాలని వినతి

జైపూర్ : భార్య, కొడుకు తనను టార్చర్ చేశారంటూ రాజస్థాన్​లోని భరత్​పూర్ రాజ వంశీయుడు, మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టుకెక్కారు. వారి నుంచి తనకు నెలకు రూ.5 లక్షల మెయింటనెన్స్ చార్జెస్ ఇప్పించాలని వేడుకున్నారు. భార్య, కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని భరత్​పూర్​ సబ్​డివిజన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆయన ఇటీవల అప్పీల్ దాఖలు చేశారు.

భార్య దివ్యాసింగ్, కొడుకు.. మాజీ ఎంపీ అనిరుధ్​ సింగ్ తనను కొట్టారని, తన ఇల్లు మోతి మహల్​ నుంచి బయటకు గెంటేశారని ఆయన ఆరోపించారు. దీంతో తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్​లో, బయట హోటల్స్ లో గడపాల్సి వస్తోందన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు తనను రూమ్​లో లాక్ చేసి, తాగేందుకు నీళ్లివ్వలేదని, తిండి పెట్టలేదని, ప్రజల్ని కూడా కలవనివ్వలేదని పేర్కొన్నారు.

ఆస్తుల కోసం చంపేందుకు కుట్ర

భార్య, కొడుకు కలిసి ఆస్తుల కోసం తనను నన్ను చంపేందుకు కుట్ర పన్నారని సింగ్ ఆరోపించారు. తన తండ్రి రాసిచ్చిన వీలునామా ద్వారా తనకు సంక్రమించిన మోతీ మహల్, కోఠి దర్బార్, గోల్ బాగ్ కాంప్లెక్స్, సూరజ్ మహల్​ను తిరిగి తనకే ఇప్పించాలని కోరారు. వీటికి సంబంధించిన పత్రాలు, రికార్డులను తన భార్య, కొడుకు.. చింపేసి బావిలో పడేశారని సింగ్ ఆరోపించారు.

ఆపై తనను ఇంట్లోంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను విశ్వేంద్ర సింగ్ భార్య, కొడుకు కొట్టిపారేశారు. ఈ కేసులో అసలు బాధితులం తామేనంటూ అనిరుద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.