మట్టి గణపతినే ఎందుకు పూజించాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?

పుట్టుక చిత్రం పునర్జన్మ విచిత్రం వినాయకుడి గాథలు చిత్రవిచిత్రం గణపతి.. సురపతి కావడం కొండంత ఏలిక చిట్టి ఎలుకను అధిరోహించడం అసురుల భరతం పట్టడం.... భారతం రాయడం కోసం ఘంటం చేతపట్టడం ...ఇలా ఏకదంతుడి కథలు జగమంతా తలుచుకుని మురిసిపోయే శుభఘడియ వినాయక చవితి. ఈ పర్వదినం సందర్భంగా తొలిపూజలు అందుకునే మేటివేలుపు తత్తాన్ని తెలుసుకుందాం.

వినాయకుడి పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది. అంతులేని ఆనందం కలుగుతుంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు గణపతి అనగానే ఓ చైతన్యం తమను ఆవహించినట్లుగా భావిస్తారు. వినాయకుడు తనకు మాత్రమే చెందిన దేవుడు. తన గోడు వింటాడు. తనకు ఏ కష్టమూ రానివ్వడని ప్రతి భక్తుడూ భావిస్తాడు. భక్తుల మనసులలో ఇంతగా సుప్రతిష్ఠితమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. 

ముద్గలపురాణంలో వినాయకచవితి పూజా నియమాల గురించి విస్తారంగా వర్ణితమై ఉంది. కణ్వమహర్షి భరతుడికి గణపతి తత్త్వాన్ని, భాద్రపద శుక్ల చవితి వ్రత మహిమ గురించి వివరించినట్లు అందులో ఉంది. ప్రధానంగా మట్టి గణపతిని ఎందుకు పూజించాలనే విషయాన్ని ముద్గలపురాణం స్పష్టంగా చెబుతున్నది.

మట్టి గణపతే శ్రేష్ఠం

ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది. తద్వారా ఆహార పదార్థాలు, ఓషధులను మనకు అందిస్తుంది. ఈ విధంగా ప్రాణాధార, జడశక్తుల కలయికతో సృష్టి సాగుతున్నదని చెప్పడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేసి, ఆ మృణ్మయ మూర్తిని పూజించే విధానం ఏర్పడింది.

ALSO READ | గణపయ్యకు వెరైటీ ప్రసాదాలు ఇవే.. ఎలా తయారు చేయాలో తెలుసా..

మట్టి గణపతిని పూజించటంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి. మానవ శరీరంలో ఉండే షట్చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత గణపతి. మూలాధారం పృథ్వీ తత్త్వం కలిగి ఉంటుంది. పృథ్వి అంటే భూమి. కాబట్టి, భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి, మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి. దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది.

పంచభూతాలకు ప్రతీక

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల్లోని ప్రతి భూతంలోనూ, దాని తత్త్వం 1/2 వంతు, మిగిలిన నాలుగు భూతాల తత్త్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. భూమిని తీసుకుంటే అందులో భూతత్త్వం 1/2 భాగం అయితే, 1/8 భాగం జలం, 1/8 భాగం అగ్ని, 1/8 భాగం వాయువు, 1/8 భాగం ఆకాశం ఉంటాయి. దీన్నే ‘పంచీకరణం’ అంటారు. ఒక్కో తత్త్వానికి ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటారు. భూతత్త్వానికి అధిష్ఠాన దేవత గణపతి, ఆకాశ తత్త్వానికి ఈశ్వరుడు (శివుడు), జల తత్త్వానికి నారాయణుడు, అగ్ని తత్త్వానికి అంబిక, వాయు తత్త్వానికి ప్రజాపతి (బ్రహ్మ) అధిదేవతలు. మనం పూజించే మట్టి విగ్రహంలో గణపతి తత్త్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన దేవతల తత్త్వాలు అన్నీ కలిపి 1/2 భాగం ఉంటాయి.

 ‘ఆకాశాత్‌ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం, సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి’

 అన్నట్లు ఎన్నో రూపాల్లో, ఎన్నో విధాలుగా కనిపించినా పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం అన్నమాట. ఈ ప్రయోజనం ఇతర పదార్థాలతో చేసే గణపతి మూర్తులను ఆరాధించడం వల్ల కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టి ధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్లలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్త్వాలు క్రమంగా వాటిలో లీనమవుతాయి.