కుంభమేళా2025: ప్రయోగ్ రాజ్ లోనే ఎందుకు నిర్వహించాలి.. పురాణాల్లో ఏముంది..

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.  వీటి కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు హాజరు కానున్నారు.  2025 లో జరిగే కుంభమేళాకు దాదాపు 40 కోట్లమందికి పైగా భక్తులు.. సాధువులు వస్తారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఉత్సవాల నిర్వహణకు యూపీ ప్రభుత్వం రూ. 7,500 కోట్లను మంజూరు చేసింది. 

ఉత్తర ప్రదేశ్  ప్రయాగ్ రాజ్.. సంగం నగరంలో కుంభమేళా  2025 జనవరి 13నుంచి  45 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం.. దేవతలు.. రాక్షసులు సముద్ర మథనం సమయంలో అమృతం వచ్చినప్పుడు ఒక్కసారిగా కుండ నుంచి 12 ప్రదేశాల్లో పడింది.  

భూమిపై నాలుగు ప్రదేశాల్లో.. స్వర్గలోకంలో 8చోట్ల పడిందని రుషి పుంగవులు చెబుతారు.  ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని , నాసిక్ అనే ప్రదేశాల్లో అమృత చుక్కలు పడ్డాయని ఆథ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తొంది. ప్రయాగ్‌రాజ్ సంగమం, ఉజ్జయిని శిప్రా, హరిద్వార్‌లోని గంగ, నాసిక్‌లోని గోదావరిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే  ఈ నదుల ఒడ్డున ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. 

జ్యోతిష్య గణనల ఆధారంగా కుంభ వేదిక నిర్ణయించేందుకు  గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో...  సూర్యుడు మకరరాశిలో..  బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది .బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు ...  సూర్యుడు మేషరాశిలో సంచరిస్తున్నప్పుడు హరిద్వార్‌లో...నాసిక్‌లో గురుడు సింహరాశిలో సంచరించినప్పుడు నిర్వహిస్తారు.  బృహస్పతి సింహరాశిలో మరియు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు, ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు.

ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో కుంభమేళాను ఘనంగా  నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమవుతోంది. భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. 

 50 వేల మంది పోలీసు సిబ్బందితో పాటు .. 2,700 సీసీ కెమెరాలతో 24 గంటలూ రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కుంభమేళాకు AI ను భద్రత విషయంలో వినియోగించుకోనున్నారు. అంతే కాకుండా నది లోపల  100 మీటర్ల వరకు ఉన్న వస్తువులను గుర్తించేందుకు అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.  

 మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు యూపీ ప్రభుత్వం 2వేలకు పైగా డ్రోన్లతో భారీ డ్రోన్‌ షోను కూడా ఏర్పాటు చేస్తోంది.  1882లో భారతదేశ జనాభా 22.5 కోట్లు. అప్పట్లోనే మాఘ అమావాస్య నాడు 8 లక్షల మంది పవిత్ర సంగమంలో స్నానమాచరించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసింది రూ 20వేల 288 మాత్రమే. ఇప్పుడు ఏకంగా రూ.7,500 కోట్లను కేటాయించింది.