శివ్వంపేట మండలంలో రోడ్డు పని ఆలస్యం ప్రమాదానికి కారణమా..!

  • ఏడుగురు చనిపోయాక సూచిక బోర్డు ఏర్పాటు

మెదక్​, శివ్వంపేట, వెలుగు: మండలంలోని ఉసిరికపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడానికి కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు రోడ్డు నిర్మాణ పని ఆలస్యం కూడా ఓ కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ఏళ్లుగా అధ్వాన్నంగా మారి వెహికల్స్​రాకపోకలకు అసౌకర్యంగా మారిన ఈ రోడ్డు అభివృద్ధికి నిధులు మంజురైనప్పటికీ పనులు ఆలస్యమవుతున్నాయని, ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరూట్​లోని గ్రామాల ప్రజలు చెబుతున్నారు. 

ఉసిరికపల్లి చౌరస్తా నుంచి పోతులబోగడ గ్రామం వరకు 8 కిలోమీటర్లు, అనంతరం చౌరస్తా నుంచి  చండి గ్రామం వరకు10 కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వాన్నంగా మారింది. ఏండ్ల తరబడి అభివృద్ధికి నోచుకోకపోవడం, కనీసం మెయింటెన్స్​ అయినా సరిగా చేయకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  రోడ్డు పూర్తిగా కంకర తేలి, గుంతలు పడడంతోపాటు, వర్షాలు కురిసినపుడు బురదమయంగా మారుతోంది. ఈ కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రెండేళ్ల కింద 18 కిలోమీటర్ల దూరం రోడ్డు అభివృద్ధికి రూ.38  కోట్లు మంజూరయ్యాయి. అర్అండ్ బీ అధికారులు పలుమార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఎట్టకేలకు గతేడాది టెండర్​ ఖరారు కాగా కాంట్రాక్టర్​ పనులు మొదలుపెట్టారు.  

ప్రమాద సూచికలు లేక..

ఉసిరికపల్లి రూట్​లో పోతుల బోగుడ వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. పలుచోట్ల కల్వర్టులు నిర్మించారు. ఉసిరికపల్లి శివారులో వాగు ఉన్న చోట బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఉసిరికపల్లి చౌరస్తా నుంచి గ్రామం వైపు వెళ్లే రూట్​లో రోడ్డు విస్తరణ పని జరుగగా వాగు ఉన్న చోట రోడ్డు ఇరుకుగా మారింది. అక్కడ వాహనదారులను అలర్ట్​ చేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలాంటివి ఏమీ పెట్టలేదు. దీంతో ఉసిరికపల్లి చౌరస్తా నుంచి స్పీడ్​గా వస్తున్న వెహికల్స్​ వాగు దగ్గరకు రాగానే రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. 

బుధవారం కారు  వాగులో బోల్తా పడడానికి ఇది కూడా కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అంతేగాక బ్రిడ్జికి సైడ్​వాల్​ లేకపోవడంతో కారు నేరుగా వాగులోకి దూసుకెళ్లి నీట మునిగింది. సైడ్​వాల్​ ఉన్నట్టయితే కారు దానిని ఢీకొనేది అప్పుడు ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదని స్థానికులంటున్నారు. బుధవారం కారు బోల్తా పడి ఏడుగురు మృతి చెందగా, గురువారం ఆర్​అండ్​బీ అధికారులు అక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, అవసరం ఉన్న చోట బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.