మీరెందుకు మా దేశానికి రారు..? సూర్యను ప్రశ్నించిన పాక్ అభిమాని

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయమై బీసీసీఐ, పీసీబీ మధ్య వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ జట్టును పొరుగు దేశానికి పంపబోమని బీసీసీఐ చెప్తుంటే.. దాయాది దేశం మాత్రం రావాలని పట్టుబడుతోంది. ఇదే విషయపై ఓ పాక్ అభిమాని.. భారత బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించాడు.

ప్రస్తుతం భారత టీ20 జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య రెండు టీ20లో జరగ్గా.. చెరొక మ్యాచ్ లో విజయం సాధించాయి. తదుపరి టీ20 నవంబర్ 13న సెంచూరియన్ వేదికగా జరగనుంది. కాస్త తీరిక దొరకడంతో భారత ఆటగాళ్లు సెంచూరియన్ నగర వీధుల్లో సందడి చేశారు. ఒక గేమింగ్ ఆర్కేడ్‌లో అభిమానులతో కలిసి ఫోటోలు దిగి వారిని సంతోషపరిచారు. ఈ క్రమంలోనే భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు.. పాక్ అభిమానుల నుంచి ధీటైన ప్రశ్న ఎదురైంది. 

మీరెందుకు మా దేశానికి రావట్లేరు..?

"ముజే ఏక్ బాత్ బతా సక్తేన్ హై కే పాకిస్థాన్ క్యు నహీ ఆ రహే ఆప్ (మీరు పాకిస్తాన్‌కు ఎందుకు రావడం లేదు చెప్పండి)?" అని ఓ పాక్ అభిమాని సూర్యను ప్రశ్నించాడు. అందుకు సూర్య.. "అరే భయ్యా, హమారే హాత్ మే థోడీ హై (బ్రదర్, ఇది మా చేతుల్లో లేదు).." అని సమాధానమిచ్చాడు. అంటే, తుది నిర్ణయం తమది కాదని బోర్డు చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saif ul islam (@saifbutt_10)