పదేండ్ల పాలనలో బతికింది దోపిడా? తెలంగాణా?

తెలంగాణ పేరును కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం ఊరు తెలంగాణగా మార్చుకున్నది. 2002లో  కరీంనగర్  సింహ గర్జన,  వరంగల్ సింహగర్జన తదితర సమావేశాలలో ఉన్న  సొక్కం  తెలంగాణవాదులు దూరమైపోయి  కేసీఆర్​ తెలంగాణవాదుల పార్టీగా  బీఆర్ఎస్​ మారిపోయింది.  తెలంగాణవాదులు ఎందుకు దూరమయ్యారో,   కేసీఆర్  ఒక పథకం ప్రకారం వారిని ఎందుకు దూరం పెట్టారో  కారణాలను ఇప్పటికైనా నాలుగు కోట్ల తెలంగాణ  ప్రజలకు  కేసీఆర్ చెప్పడంలేదు.  

తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంటులో  ప్రవేశపెట్టినపుడు కనీసం హాజరుకాని పెద్దమనిషి .. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇదంతా చేశారని తన భక్త భజన బృందాలతో ప్రచారం చేయించుకోవడం తప్ప మిగిలింది ఏమీ లేదు.  బీబీ మియా  సోలెడు బియ్యం నినాదం నుంచి మొత్తం కుటుంబం టీఆర్ఎస్ పార్టీగా అవతరించి  తెలంగాణను అనుభవించిన  వారి కుటుంబ  కళా కౌశలాన్ని,  నైపుణ్య మూలాలను నేడు యావత్  తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అనివార్యత ఏర్పడినది.


కేసీఆర్  భూస్వామ్య వర్గం నుంచి ఎదిగి వచ్చినాడు.  తెలంగాణలో సొంత ఎజెండాతో  పనిచేశాడు. దీన్ని అర్థం చేసుకోవడంలో,  ఆయన వ్యక్తిత్వాన్ని బేరీజు వేయడంలో తెలంగాణ మేధావి వర్గం విఫలం చెందినది . ఎందుకంటే ఆయన 
వ్యక్తిత్వంలోనే   అపరిచితుడు దాగి ఉన్నాడు. ఆయన గతాన్ని, ఎదిగి వచ్చిన రాజకీయ జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే  తెలంగాణ పదేండ్లలో  కరి మింగిన వెలగ పండులా కావడానికి కారణాలు అవగతమవుతాయి.  

తెలంగాణ ఉద్యమ కాలంలోనే ఈ కుటుంబం ఎలా ఎదిగిందో ,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలా దోచుకుందో  తెలిసిన విషయమే.  మిషన్  కాకతీయ పేరున మేనల్లుడు హరీష్ రావుకు,  మిషన్ భగీరథ పేరున కొడుకు కేటీఆర్​కు,  తెలంగాణ ఉద్యమ కాలం నుంచి జాగృతి పేరున కవిత బతుకమ్మ ఆట పాటలలో ఎంతెంత  గిల్లారో  ప్రస్తుత  ప్రభుత్వం తేల్చి  తెలంగాణ  ప్రజలకు  తెలియజెప్పాలి.

తెలంగాణవాదులు అంతా ఎటుపోయారు?

2018 తర్వాత  నీటిపారుదల శాఖను నాటి ముఖ్య మంత్రి కేసీఆర్ తన అధీనంలో ఉంచుకున్నాడు. దీని వెనుక బహు చక్కని రంజు అయిన కథాకమామిషు ఉన్నది.  ‘చావు నోట్లో తలపెట్టి  కేసీఆర్ తెలంగాణను సాధించాడని’ ఆయన వందిమాగధులు ఒక  భావనను  ప్రచారం చేశారు. జయశంకర్, బియ్యాల జనార్దన్ రావు, కోదండరాం తదితర  తెలంగాణ భావ నిర్మాణవాదులందరినీ  కనుమరుగు చేసేవిధంగా ఇప్పుడు ‘తెలంగాణ బాపు’ అని కేసీఆర్ చాటింపు వేసుకుంటున్నాడు.  

తెలంగాణవాదులు అంతా ఎటుపోయారు?  పార్లమెంటు దగ్గర చెట్టుకు ఉరి వేసుకున్న ఈశాన్ రెడ్డి,  పెట్రోలు పోసుకొని జై తెలంగాణ అంటూ మరణించిన అమరుడు   శ్రీకాంత్ చారి, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల బారికేడ్ల మధ్య నుంచి దాటిన యాదయ్య అమరత్వాలన్నీ ఎందుకు లెక్కకు రాకుండా ఎవరు కుట్ర చేశారు. 

ALSO READ | ఫిరాయింపుల నిరోధానికి కొత్త చట్టం తప్పేలా లేదు!

అమరుల కుటుంబాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి?  మరి కల్వకుంట్ల కుటుంబం 10 సంవ త్సరాల ప్రభుత్వ పాలన తర్వాత ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఉందో  చెప్పాలి.  ఇకపోతే వీరు పదవులను గడ్డి పోచల్లా భావించామని,  రాజీనామా చేశామని  తరచుగా ఊదరగొడుతుంటారు.   

ప్రజలు చేతుల్లోకి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకునే దశలో ప్రతిసారి రాజీనామా చేశారు తప్ప ఏదో దాన్ని త్యాగం అంటే ఎవరైనా నవ్విపోతారు. ప్రశ్నించే,  అడిగే  తెలంగాణవాదులందరినీ కించపరిచి అవమానించి బయటకు పంపించారు.  కేసీఆర్ తమకు,  తమ కుటుంబానికి ఎదురులేకుండా లైన్ క్లియర్ చేసుకున్నారు. కేసీఆర్,  ఆయన అనుయాయులు చెప్పుకుంటున్న దీక్ష దివస్  నిరాహార దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన మందకృష్ణ మాదిగ తదితరులంతా ఎందుకు శత్రువులు అయ్యారు?  కేసీఆర్​తో సహా మిగతా వారందరూ వీరి ఒంటెద్దు పోకడలను విమర్శించిన వారందరినీ తెలంగాణ వ్యతిరేకులని బట్ట కాల్చి మీదేశారు.

అయ్యా పులి వచ్చే కథ యాదికి వస్తున్నది

వీరు గొప్పగా చెప్పుకుంటున్న  కాళేశ్వరం ప్రాజెక్టు కథ, మిషన్ భగీరథ  పొగడ్తలు వింటే  చెప్పేవాడికి వినేవాడు  లోకువ అన్నట్టు ఉంది.  కాకతీయ, భగీరథ, ధరణి, రైతుబంధు, దళిత బంధు, పింఛన్లు వెనుకనున్న మతులబు భయంకరమైనది. ధరణిలో  భూ రికార్డుల ధ్వంసం, కాస్తు కాలాన్ని తీసేసి ఉత్తర తెలంగాణలో రాజకీయ వామపక్షవాదులు పంచిన భూములను తిరిగి  భూస్వాములకు ధారాదత్తమయ్యేలా చూశాడు.  తద్వారా వేలాదిమంది కౌలు రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్​ కారకుడు అయ్యాడు.  

కేసీఆర్​ పరివారమంతా తెలంగాణ సహజ వనరులను 10  సంవత్సరాల పాలనలో  వేల కోట్ల దోపిడీ  చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి లక్షలాది కోట్ల అప్పులపాలు చేశారు.  మొత్తానికి ఇవ్వాళ కల్వకుంట్ల వారు కలలో కూడా ఊహించని విధంగా  మారిన ప్రభుత్వాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు.  కేటీఆర్ ఒకవైపు హరీష్ రావు ఒకవైపు ఇది చేయలేదు అది చేయలేదని ఏదో గొప్పగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు, తాము మాత్రమే తెలంగాణ రక్షకులమని, మిగతా వారంతా భక్షకులు, అవినీతిపరులు అని గోబెల్స్​ ప్రచారం చేస్తున్నారు.

 రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2023 చివరన ఏర్పడిన కాంగ్రెస్  ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తుంటే  కేటీఆర్, హరీష్ రావు వారికాలంలో ఎంతో చేశామని మాట్లాడుతుంటారు.  వీళ్ళ మాటలను చూస్తుంటే  ‘అయ్యా పులి వచ్చే’  కథ యాదికి వస్తున్నది.  వీళ్లు  చేసిన పనులకు ఎప్పుడో ఒకసారి ఖాకీపులి పట్టుకపోతుంది. ఇటీవల వీరు ఐఏఎస్,  ఐపీఎస్ ఆఫీసర్లను  బెదిరించే  తీరు చూస్తే  ఎంత అసహనం,  కలవరపాటు ఉందో కనిపిస్తుంది.

- జూకంటి జగన్నాథం, కవి, రచయిత-