Suryansh Shedge: ముంబై జట్టులో సూర్య లాంటి మరొకడు.. ఎవరీ సూర్యంష్ షెడ్గే..?

పృథ్వీ షా, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే వంటి హేమాహెమీలున్న ముంబై జట్టులో 21 ఏళ్ల కుర్ర క్రికెటర్ పేరు బాగా వినపడుతోంది. మ్యాచ్ చివరలో అతను ఆడుతున్న గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లే అందుకు కారణం. భారత టీ20 స్పెషలిస్ట్ సూర్య క్రీజులో కుదురుకుంటే ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో.. 21 ఏళ్ల బుడతడు సైతం అటువంటి విధ్వంసమే సృష్టిస్తున్నాడు. 

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 21 ఏళ్ల సూర్యంష్ షెడ్గే మంచి ప్రదర్శన కనపరుస్తున్నాడు. ఆంధ్రపై 8 బంతుల్లో 30 పరుగులు చేసి పాయింట్ల పట్టికలో ముంబైని అగ్రస్థానంలో నిలిపిన షెడ్గే.. బుధవారం విదర్భతో జరిగిన పోరులో 12 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టును సెమీ-ఫైనల్ చేర్చాడు.

ALSO READ | మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన

విదర్భపై 224 పరుగుల ఛేదనలో షెడ్గే ఆడిన ఇన్నింగ్స్ చాలా గొప్పది. మ్యాచ్ చేజారింది అనుకున్న సమయంలో అద్భుతం చేశాడు. విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 62 పరుగులు అవసరం కాగా.. మరో నాలుగు బంతులు మిగిలివుండగానే మ్యాచ్ ముగించాడు. దాంతో, షెడ్గే సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.

ఐపీఎల్ వేలంలో రూ.30 లక్షలు 

గత నెలలో జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సూర్యాంశ్ షెడ్గేను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. రూ. 30 లక్షల బేస్ ధరకు అతన్ని సొంతం చేసుకుంది.