ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ (Gukesh) నిలిచాడు.ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించి ఛాంపియన్‌గా నిలవాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
తల్లిదండ్రులది గోదావరి జిల్లా
అంతర్జాతీయ వేదికపై విజేతగా నిలిచి.. దేశ ఖ్యాతిని మరో పెట్టు ఎక్కించిన గుకేశ్.. తెలుగు కుర్రాడు. ఇతని తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా. తండ్రి.. రజనీకాంత్. ఈయన పేరు మోసిన డాక్టర్. చెవి, ముక్కు, గొంతు సర్జన్. తల్లి.. పద్మ. ఈమె మైక్రోబయాలజిస్ట్. ఈ దంపతులు చెన్నైలో స్థిరపడటంతో.. గుకేశ్ 29 మే, 2006న చెన్నైలో జన్మించారు.
తల్లిందండ్రులిద్దరూ మంచి చదువులు చదివిన వారు కావడంతో కొడుకును ఉన్నత హోదాలో చూడాలనుకున్నారు. కానీ, వారి కుమారుడు అంచనాలను తలకిందులు చేస్తూ చదరంగాన్ని ఎంచుకున్నాడు. 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. తొలి రోజుల్లో రోజుకు గంట చొప్పున వారంలో మూడు రోజులు సాధన చేసేవాడు. అలా మొదలైన అతని చదరంగ నైపుణ్యం ఉపాధ్యాయులను ఎంతో ఆకట్టుకుంది. మెళుకువలు నేర్చుకున్న అనంతరం వారాంతాల్లో టోర్నమెంట్లలో పాల్గొనడం మొదలు పెట్టాడు.
ALSO READ | World Chess Championship 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత గుకేష్
ఇతనికి తొలి విజయం అంటే.. తొమ్మిదేళ్ల వయస్సులో 2015లో ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్‌షిప్ అండర్ 12 విభాగంలో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలుచుకొని ప్రశంసలు అందుకున్నాడు. అనంతరం 12 ఏళ్ల వయసులో అండర్ 12 విభాగంలో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఐదు బంగారు పతకాలు సాధించాడు. 2017లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తద్వారా 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయస్సులో గ్రాండ్ మాస్టర్ అర్హత సాధించిన మూడో పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
2023.. గుకేశ్ తనను తాను ప్రపంచానికి తెలిసొచ్చేలా చేసిన సంవత్సరం. గతేడాది ఆగస్ట్‌లో 2750 రేటింగ్‌తో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి 36 ఏళ్లలో తొలిసారి దేశ అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచాడు. అనంతరం క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచి 40 ఏళ్ల క్రితం గ్రేట్ గ్యారీ కాస్పరోవ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఈ విజయంతో భారత ఖ్యాతిని మరో మెట్టు పెంచాడు.
రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
విశ్వ విజేతగా నిలిచిన గుకేశ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుత విజయంతో దేశం గర్వపడేలా చేశావని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. అద్భుతమైన విజయం సాధించిన గుకేశ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చెస్ చరిత్రలో గుకేశ్ అతని పేరు చిరస్థాయిగా నిలవడమే కాకుండా యువతకు గొప్ప కలలు కనేందుకు మార్గం చూపావని ప్రధాని కొనియాడారు.
The emotional moment that 18-year-old Gukesh Dommaraju became the 18th world chess champion ?? pic.twitter.com/jRIZrYeyCF
— Chess.com (@chesscom) December 12, 2024
నాలుగు సార్లు (2007, 2008, 2010, 2012) గెలిచిన విశ్వనాథన్ ఆనంద్ అడుగుజాడల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న రెండవ భారతీయుడు.. గుకేశ్.