IND vs AUS: ఎవరీ బ్యూ వెబ్‌స్టర్.. సిడ్నీ టెస్టులో ఆరున్నర అడుగుల బుల్లెట్

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టుకు కౌంట్‌డౌన్ మొదలైంది. శుక్రవారం(జనవరి 03) ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ ఆఖరి మ్యాచ్ ద్వారా ఆరున్నర అడుగుల ఆల్‌రౌండర్ ఒకరు ఆసీస్ జట్టు తరుపున టెస్ట్ అరంగ్రేటం చేయనున్నాడు. అతని పేరు.. బ్యూ వెబ్‌స్టర్‌ (Beau Webster). ఇతనికి తుది జట్టులో స్థానం ఖాయం. ఆల్-రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో ఇతడు బరిలోకి దిగనున్నాడు. దాంతో, ఇతను ఎవరా..? అని నెటిజన్లు నెట్టింట తెగ శోధిస్తున్నారు.

14 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా.. 

దాదాపు 2 మీటర్ల ఎత్తుండే వెబ్‌స్టర్.. 1993 డిసెంబర్ 1న హోబర్ట్‌కు దక్షిణాన ఉన్న స్నగ్ అనే కంట్రీ టౌన్‌లో జన్మించాడు. అక్కడే తన ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేశాడు. 14 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా కేరీర్ మొదలుపెట్టి.. టాస్మానియా తరపున U-17, U-19, U-23 క్రికెట్ ఆడాడు. అప్పుడే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆపై 2014లో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. టాస్మానియా తరఫున 93 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో 5,297 పరుగులు, 148 వికెట్లు పడగొట్టాడు. 

నిలకడకు మరో పేరు.. 

వెబ్‌స్టర్ అంత చెప్పుకోదగ్గ బ్యాటర్ కానప్పటికీ, నిలకడగా ఆడటంతో మంచి దిట్ట. వికెట్ కాపాడటంలో ది బెస్ట్ అని చెప్పుకోవాలి. రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వమూ కాదు. అదే అతనికి ఆసీస్ జట్టు తరపున ఆడేలా అవకాశాన్ని కల్పిచింది. దేశవాళీ క్రికెట్‌లో గత మూడు సీజన్ల నుంచి మిడిలార్డర్‌లో విలువైన పరుగులు చేయడంతోపాటు పేసర్‌గా వికెట్లూ పడగొడుతున్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్‌ ఏతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు.

ALSO READ | IND Vs AUS: ఇదీ హిట్‌మ్యాన్ అంటే.. సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయం!

వెబ్‌స్టర్  ఇప్పటివరకు 93 టీ20లు ఆడాడు. 26.98 సగటుతో 118.71 స్ట్రైక్ రేట్‌తో 1700 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక బిగ్ బాష్ లీగ్ (BBL)లో హోబర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌, మెల్‌బోర్న్ స్టార్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆల్‌రౌండర్.. 1463 పరుగులు, 18 వికెట్లు పడగొట్టాడు. అసలే టీమిండియాకు చావో రేవో లాంటి మ్యాచ్. ఎక్కడ  ఇతడు అడ్డుపడుతాడో అన్న భయం అభిమానుల్లో లేకపోలేదు.
 
సిడ్నీ టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, బ్యూ వెబ్‌స్టర్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బోలాండ్.