అహ్మదాబాద్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గెబ్రేయేసస్ సోమవారం ఇండియాకు రానున్నారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన గుజరాత్‌లో పర్యటించనున్నారు. సోమవారం రాజ్‌కోట్‌కు చేరుకుని, అక్కడే ఉంటారు. మంగళవారం ప్రధాని మోడీతో కలిసి జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (జీసీటీఎం)కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని రాజ్‌కోట్ కలెక్టర్ అరుణ్ మహేశ్ బాబు ఆదివారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ వైద్యం కోసం జీసీటీఎం మొదటి, ఏకైక గ్లోబల్ అవుట్‌పోస్ట్ కేంద్రంగా ఉంటుందని చెప్పారు. తర్వాత బుధవారం గాంధీనగర్‌లో మహాత్మా మందిర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్ సదస్సును మోడీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మోడీతో కలిసి టెడ్రోస్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ సదస్సులో 90 మంది ప్రముఖ వ్యక్తులు, 100 మంది ఎగ్జిబిటర్స్ పాల్గొంటారని చెప్పారు.
