బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా?...ఎమ్మెల్సీ కవితపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

  • బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు
  • అగ్ర కులాల చెప్పుచేతల్లో ఉద్యమం చేయాల్సిన కర్మ బీసీలకు లేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉందని, ఈ వర్గాల గురించి ఎమ్మెల్సీ కవిత పోరాటం చేయాల్సిన అవసరం లేదని విప్ ఆది శ్రీనివాస్ ఫైరయ్యారు. బీసీలకు, కవితకు సంబంధం లేదని, బీసీ రిజర్వేషన్లపై హడావుడి అంతా డ్రామా అని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన రిలీజ్​ చేశారు. లిక్కర్ కేసు నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు కవిత ప్రయత్నిస్తున్నదన్నారు.

లిక్కర్ దందాలో ఆరు నెలలు జైల్లో ఉండొచ్చిన కవిత లాంటి వారి నాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు. అగ్ర కులాల చెప్పుచేతల్లో ఉద్యమాలు చేయాల్సిన కర్మ బీసీలకు పట్టలేదన్నారు. వచ్చే నెల 3న బీసీ సభ నిర్వహిస్తామని కవిత చెప్తున్నారని, సభ నిర్వహించే హక్కు ఆమెకు ఎక్కడిదని ప్రశ్నించారు. కవిత నిర్వహించే సభకు బీసీలెవరు వెళ్లవద్దని కోరారు. రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తున్నట్లు కవిత చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు ఎందుకు గుర్తుకురాలేదు అని ప్రశ్నించారు.

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా కులగణన జరిగిందన్నారు. కులగణనలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ అని, రాహుల్ గాంధీ సూచనతోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టారని చెప్పారు. బీసీలపై బీఆర్ఎస్ కు అంత ప్రేమ ఉంటే కులగణనను ఎందుకు ఆహ్వానించలేదని, ఈ ప్రోగ్రామ్ లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు.

బీసీలకు రుణాలు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. గిరిజన, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ఆనాడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.