జీవో 317 బాధితులకు న్యాయం ఎప్పుడు.?

గత  ప్రభుత్వం  తీసుకొచ్చిన  చీకటి  జీవో  317  ఉద్యోగుల  పాలిట శాపంగా మారింది.  ఈ  జీవో  ఉద్యోగ,  ఉపాధ్యాయుల  జీవితాల్లో  ముఖ్యంగా  జూనియర్ల  పాలిట  ఒక ఉపద్రవంలా మారింది.  వారి జీవితాలతో ఒక ఆట ఆడుతూ వారిని మానసికంగా, శారీరకంగా క్షీణింపచేస్తోంది.  ఈ జీవో  వలన  కొంతమంది  ఆత్మహత్య  చేసుకున్నారు. ఇంకొందరు  దూరపు  ప్రయాణాలు  కారణంగా ఆక్సిడెంట్లకు గురవుతున్నారు.  మరికొందరు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయారు.  ఈ  జీవో  వలన  ఏర్పడిన పరిస్థితుల్ని,  పరిణామాల్ని వివరించే అవకాశం గత ప్రభుత్వం  కల్పించలేదు.  

ఆనాడు కాంగ్రెస్  పార్టీ..  జీవో17 బాధితులకు అండగా నిలుస్తామని మాట ఇచ్చింది. 317 జీవో  ద్వారా ఎవరైతే  తమ  జిల్లాలను  వదిలి దూరపు జిల్లాలకు కేటాయించారో వారిని ఆదుకుంటామని తెలిపింది.  ప్రతి బాధితుడికి  కాంగ్రెస్ ప్రభుత్వం  న్యాయం  చేస్తామని మేనిఫెస్టోలో  కూడా  పేర్కొంది.  అప్పటి పీసీసీ  చీఫ్  రేవంత్ రెడ్డి  తాను ముఖ్యమంత్రి అయిన 48 గంటల్లోనే  జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది.  సీఎం  రేవంత్ రెడ్డి  ఇచ్చిన ఆ భరోసాతో  పూర్తిగా  నమ్మిన  త్రీ వన్ సెవెన్ బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా  పోరాడారు.  పోస్టల్ బ్యాలెట్ నైతే  ఒక ఉద్యమ ప్రాతిపదికన వేయడం జరిగింది.  కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి త్రీ వన్ సెవెన్  బాధితులు కీలక పాత్ర పోషించారు.

సబ్ కమిటీ  నివేదిక అందజేత

 కాంగ్రెస్​ ప్రభుత్వం  ఏర్పడిన  తర్వాత ఈ జీవో పైన  సబ్ కమిటీ  వేశారు. సబ్ కమిటీ చైర్మన్​గా  దామోదర్ రాజనర్సింహ, సభ్యులుగా  మంత్రులు  శ్రీధర్ బాబు,  పొన్నం ప్రభాకర్​లను నియమించడం జరిగింది. ఇటీవల సబ్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వారు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే, ఈ 317 సబ్  కమిటీ  రిపోర్టులో అసలు ఏముందో  ఎవరికి ఇంతవరకు తెలియదు. ఇప్పటికీ  జీవో  త్రీ వన్ సెవెన్ సబ్ కమిటీ రిపోర్టు బహిర్గతం కాలేదు. ఇంకా ఈ విషయాన్ని రహస్యంగానే ఎందుకు ఉంచుతున్నారనేది అర్థం కాని ప్రశ్న?.  ఈ317 జీవో  వలన వేరే జిల్లాలకు దూర ప్రయాణాలు చేస్తూ,  కొందరు  ఉద్యోగులు తమ కుటుంబానికి దూరంగా బతుకుతూ నిరంతరం నరకయాతన అనుభవిస్తున్నారు.  317 జీవో  బాధితులను ఆదుకుని కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం.

ALSO READ : సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో పాలన!

కేవలం మానవతా దృక్పథంతో చేసే బదిలీలనే జీవో 317 కమిటీ రిపోర్ట్ ద్వారా కూడా జరిపితే కనుక జిల్లాలు మారిన అసలైన  జీవో 317 బాధితులకి న్యాయం జరగదు.  కాంగ్రెస్ ప్రభుత్వమే 317 బాధితులకు  అండగా నిలబడి మిమ్మల్ని మీ జిల్లాలకు చేర్చే బాధ్యత మాది అంటూ ఎంతో నమ్మకాన్ని కలిగించిన విషయం మరవరాదు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర సంబురాలు  చేసుకుంటున్న ఈ శుభసందర్భంలో  రేవంత్​ సర్కారు ఇచ్చిన హామీని  తప్పకుండా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం.

- కె. రత్నమాల,
ప్రధాన కార్యదర్శి, 
317 జీవో బాధిత డిస్లోకేటెడ్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం