సహారా బాధితులకు డబ్బులు పడేది ఎప్పుడో చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

సహారా ఇండియా.. ఈ పేరు చెప్పగానే ఎన్నో కన్నీళ్ల కథలు .. ఎంతో మంది కష్టాల గాథలు  గుర్తుకు వస్తాయి. రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు కొందరు.. మధ్య తరగతి ఆశాజీవులు కొందరు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని సహారాలో పెట్టుబడి పెట్టారు. కాయాకష్టం చేసి సంపాదించిన డబ్బులను తమ పిల్లల కోసమో.. లేదా భవిష్యత్తు కోసమో దాచుకున్న  డబ్బులను కొల్లగొట్టి బోర్డు తిప్పేయడంతో ఎంతో మంది రోడ్డున పడ్డారు. లాభం లేకపోయినా సరే.. తమ కష్టార్జితం ఎప్పుడు చేతికి వస్తుందా అని వేయి కళ్లతో వేచిచూస్తున్న సహారా బాధితులకు ఇప్పుడొక శుభవార్త. సహారా బాధితులకు డబ్బులు ఇస్తామని, దానికి సంబంధించిన వివరాలు వెల్లడించింది ప్రభుత్వం. 

సహారా బాధితులకు రీఫండ్ చేసేందుకు 2023, జులై 18న సహారా రీఫండ్ పోర్టల్ (CRCS) లాంచ్ చేసి ఏడాది దాటినా కూడా ఇప్పటికి డబ్బులు బాధితులకు అందలేదు. సహారా బాధితులకు డబ్బు తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రీఫండ్ పోర్టల్ ఏర్పాటు అయ్యింది. కానీ బాధితులు మాత్రం తమ పెట్టుబడి ఎప్పుడు తిరిగి ఇస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఈ అశంపై లోక్ సభలో ఎంపీ సునీల్ కుమార్  సహారా బాధితులకు డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారని  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోట్లాది ప్రజల డబ్బులు సహారా ఫైనాన్స్ లో ఇరుక్కుపోయాయని, ప్రభుత్వం పోర్టల్ ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకు ఇంకా బాధితుల అకౌంట్లో డిపాజిట్ కావట్లేదని ప్రశ్నించారు. అదే విధంగా ఇప్పటి వరకు ఎంత మంది అకౌంట్లో డబ్బులు పడ్డాయి, వారి వివరాలేమిటి అని అడిగారు. ప్రభుత్వానికి లేదా సెబీకి రీఫండ్ విషయంలో ఏమైనా కార్యాచరణ ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. 

Also Read : పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్నవ్యక్తి

దీనిపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు 2012, ఆగస్టు 31న  సహారా రియల్ ఎస్టేట్ కార్పోరేషన్  (SIRECL),  సహారా హౌజింగ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ (SHICL), అదే విధంగా సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లను రూ.25,781.37 కోట్లను సెబీ (SEBI)లో డిపాజిట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. 31 మార్చి 2024 నాటికి సెబీకి రూ.15,775.50 కోట్లు డిపాజిట్ అయ్యాయని తెలిపారు. 

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రీఫండ్ కోసం బాండ్ హోల్డర్స్ ను అప్లై చేసుకోవాలని సెబీ ప్రకటించింది. అప్లై చేసుకున్న వారిలో 17,536 మంది దరఖాస్తులు పరిశీలించి రూ.138.07 కోట్ల రీఫండ్ చేసినట్లు మంత్రి తెలిపారు. మిగతా రీఫండ్ విషయంలో సెబీ అన్ని రకాల విచారణలు చేస్తోందని, బాధితులకు రీఫండ్ అందుతుందని అన్నారు. 

మిగతా రీఫండ్ ను 9 నెలలో బాధితులకు చెల్లించాలని సుప్రీం కోర్టు సెబీని ఆదేశించింది. వర్సోవా, ముంబయిలో ఉన్న భూములను అభివృద్ధి చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీలకు రూ.వెయ్యి కోట్లు డిపాజిట్ చేసి అగ్రిమెంట్ చేసుకోవాలని అనుమతించినట్లు తెలిపారు.