వాట్సాప్ నచ్చకపోతే డిలీట్ చేయండి

వాట్సాప్ నచ్చకపోతే డిలీట్ చేయండి
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై రగడ నడుస్తోంది. ఈ పాలసీ వల్ల యూజర్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని విమర్శలు వస్తున్నాయి. దీంతో చాలా మంది యూజర్లు వాట్సాప్‌‌ను తొలగించి దాని ప్లేస్‌లో సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్‌‌లను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించి వాట్సాప్, ఫేస్‌‌బుక్‌‌పై ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. వాదనల సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. వాట్సాప్ ఓ ప్రైవేట్ యాప్ అని, యూజర్లకు ఇష్టమైతే వాడుకోవచ్చునని లేదా తీసేయొచ్చునని స్పష్టం చేసింది. వాట్సాప్ లాంటి ప్రైవేట్ పాలసీలను తీసుకొచ్చిన ఇతర యాప్స్, మ్యాప్స్, బ్రౌజర్స్‌ను కోర్టు ఉదహరించింది. మిగిలిన చాలా యాప్‌‌లు ఇలాంటి తరహా ప్రైవసీ పాలసీలను వాడుతున్నప్పుడు ఒక్క వాట్సాప్‌‌నే నిందించడం సరికాదని తెలిపింది. మిగిలిన యాప్‌‌ల టర్మ్స్, కండీషన్స్‌‌ను పరిశీలిస్తే వాట్సాప్ తరహా నిబంధనలే కనిపిస్తాయని పేర్కొంది. అనంతరం విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.