ఆధ్యాత్మికం : బుద్ధియోగం అంటే ఏంటీ.. గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన జీవిత సత్యం ఇదే..!

కంటికి దూరమైన గతం గురించి, కంటికి కనపడని భవిష్యత్తు గురించే నిత్యం ఆలోచిస్తుంది బుద్ధి. భోజనంపైన, భోగాలపైన వాలుతుంది. సుఖాలను కౌగిలించుకుంటూ.. దుఃఖాలపై దుమ్మెత్తి పోస్తుంది. కోరికల వెంట పరుగులు తీసినంత కాలం దానికి సమస్యల గతే! ఎప్పుడైతే బుద్ధి నిశ్చలమై... కోరికలన్నింటినీ విడిచిపెడితేనే  అదే సమాధి స్థితి! శ్రీ కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి బుద్ధియోగం గురించి చెప్పిన తర్వాత.. మాధవా! సమాధి నిష్టలో ఉండే స్థితప్రఙ్ఞుని లక్షణం ఏంటి? అతను ఎలా మాట్లాడతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా ప్రవర్తిస్తాడు  అని అడుగుతాడు అర్జునుడు. దుఃఖ రహితంగా మారిన జీవుడు ఎలా ఉంటాడు? అని తెలియజెప్పేవే స్థిత ప్రఙ్ఞ లక్షణాలు.  

బుద్ధి (ప్రఙ్ఞ) యోగం గురించి తెలుసుకున్న అర్జునుడు తాను కూడా ఎలాగైనా ప్రయత్నించి ఆ స్థితికి చేరుకోవాలనుకుంటాడు. మరి ఆ స్థితిని చేరుకున్న వ్యక్తి ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఉత్సాహంగా బతకగలడా....  లేక ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లి ఎక్కడో ఏకాంతంగా.... ఎలాంటి స్పందన లేకుండా ఉండిపోతాడా? స్వార్థం... ద్వేషం నిండిన ఈ లోకంలో అతడు ఎలా ఇమడగలడు? ఒకవేళ ఇమిడినా అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇదే అర్జునుడు తెలుసుకోవాలనుకున్నాడు. 

భగవద్గీతలో స్థితప్రజ్ఞ' ప్రస్తావన చాలా ముఖ్యమైంది. భగవద్గీతకు ఆదర్శమూర్తి ఈ స్థితప్రజ్ఞుడు. గీతను అర్థం చేసుకున్న వాళ్లు చేరుకునే స్థానం ఇదే!  మహాత్ములు, సన్యాసులు దీన్నే సాధన చేస్తుంటారు. మహాత్మాగాంధీ  రోజూ సాయంకాలం  ప్రార్థనలో గీతలో స్థితప్రఙ్ఞుని లక్షణాలు ఉన్న 18 శ్లోకాలను చదివేవాడు. పార్థా! మనసులో కోరికలను ఎప్పుడైతే సంపూర్ణంగా విడిచిపెడతాడో, ఎప్పుడు తనలో తాను సంతోషాన్ని పొందుతుంటాదో.. అప్పుడు అతడిని స్థితప్రజ్ఞుడు అని పిలుస్తారు' అని కృష్ణుడు అంటారు.

 మనసులో అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టినవాడే స్థితప్రజ్ఞుడు. కొన్ని కోరికలు పదిలితే ప్రయోజనం లేదు. బియ్యంలో రాళ్లు ఏరినట్లు, పొలంలో కలుపు మొక్కల్ని పీకేసినట్టు .. అనేక జన్మల నుంచి జీవుడి వెంట ప్రయాణిస్తే  వస్తున్న కోరికలను  విడిచిపెట్టాలి. మరి ముందు ఆ భగవంతుడే ... ధర్మ విరుద్ధంగాని( మంచి కోరికలు) కోరికలు కోరమన్నాడు కదా...  మరి ఇక్కడేమో  కోరికలను పూర్తిగా వదలమంటున్నాడు.... ఏంటి? అని సందేహం వస్తుంది. అది సాధన చేసే దశ.   సిద్ధావస్థ... సాధకుడు మొదట మంచి కోరికలు కోరుకుంటూ చెడ్డ వాటిని విడిచిపెట్టాలి. ఆ తర్వాత మంచి కోరికలు... కూడా వాసనలూ, బంధాలే కాబట్టి వాటిని కూడా విడిచిపెట్టాలి. అప్పుడే స్థితప్రజ్ఞుడయ్యేది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. తీసిన తర్వాత...  రెండో ముల్లుని దాచిపెట్టుకుంటామా...  దాన్ని కూడా పారేస్తాం. అలాగే....  చెడ్డకోరికలను విడిచిపెట్టి వాటి స్థానంలో మంచి కోరికలను ఉంచాలి. అది సాధన దశ. ... ఆ దశ దాటిన తర్వాత మంచి కోరికలను కూడా వదిలిపెట్టాలి. ... అదే ముక్తి పొందే స్థితి. ... ..అదే స్థిత ప్రజ్ఞుని లక్షణం. ఆత్మలోనే (తనలోనే) తాను సంతృప్తి చెందాలి. ఆనందం ఎక్కడో బయట దొరకదు. ఇది నీలోనే ఉంది అది తెలియకే.. బయట దానికోసం వెతుకుతూ విషయం, వస్తు, భోగాల వెంట పరుగెడుతుంటారు. అవి దొరికినా.. వెంటనే మాయమైపోతుంటాయి. అవి శాశ్వత ఆనందాలు కావు. అన్ని కోరికలను విడిచిపెట్టిన ఆత్మలోనే అసలు ఆనందం ఉంది. అదే
ఆత్మానందం ...అదే శాశ్వతానందం.

ముఖంలో ఉద్వేగం చెందనివాడు.. సుఖాలకోసం ఆరాటపడనివాడు, రాగం, భయం, కోపం విడిచినవాడు స్థితప్రజ్ఞుడు అనిఇంకో శ్లోకంలో కొనసాగిస్తాడు మాధవుడు. మనసులో కోరికలన్నీ వదిలినా బయట జరిగే విషయాలలో కొన్నింటిని సుఖాలుగా,కొన్నింటిని దు:ఖాలుగా భావించి పొంగుతూ, కుంగుతూ ఉంటారు. సుఖాలు, దు:ఖాలు మనిషి కోరితే వచ్చేవి కావు. అలా అయితే సుఖాలనే
కోరుకుంటారు.

 స్థితప్రజ్ఞుడు ఈ సుఖాలకు పొంగకుండా. ..దు:ఖాలకు కుంగకుండా ఎలా ఉంటాడు? మేఘాల కింద ఉన్నవాళ్లకే వర్షం, ఉరుములు, మెరుపులు ఉంటాయి. మేఘాలపైన ఉంటే అవేం  ఉండవు. మనసే నేను అని...  మనను పరిధిలో ఉంటే.. మనసుకి సంబందించిన  సుఖ దు:ఖాలు రెండూ   నీవే అవుతాయి. ..వాటికే స్పందిస్తావు. అలా కాకుండా ఆత్మే ...నేను  అని ... ఆత్మ... అనుభూతిలో ఉంటే ఎలాంటి సుఖ దుఃఖాలు ఉండవు. అలాగే, రాగం (వస్తువులు, మనుషుల మీద ప్రేమ), భయం (పొందినదేదైనా చేజారిపోతుంది. అన్నప్పుడు కలిగే ప్రేరణ) కోసం (సంపాదించిన దాన్ని నిలబెట్టుకోలేనప్పుడు, లేదా లక్ష్యానికి ఎవరైనా అడ్డుపడినప్పుడు కలిగేది). ఈ మూడూ సుఖ దు:ఖాలను కలిగిస్తాయి.

కాబట్టి ఈ మూడింటిని పదిలినవాడే స్థిత ప్రజ్ఞుడు. ఎవరైతే తాను జీవించడానికి కావలసిన ముఖ్య అవసరాలతో తృప్తి చెందుతున్నాడో. ఎవరు అలాంటి జీవాధార విషయాలు (గాలి ,నీరు,నిప్పు, భూమి, ఆకాశం) తనవి కాదు అని భావిస్తాడో..  ఎవడు తాను జ్ఞానిని అనే అభిమానాన్ని కూడా విడిచి పెడతాడో, అలాంటి స్థితప్రజ్ఞుడు. బ్రహ్మజ్ఞాని..!

 సంసార సాగరాన్ని దాటి నిర్వాణాన్ని పొందుతాడు' అని అది శంకరాచార్యులు గీతా భాష్యంలో చెప్తారు. దీని గురించే కృష్ణుడు స్థితప్రజ్ఞతకు సంబంధించి. చివరి శ్లోకంలో ఇలా వివరిస్తారు.. దేహమే నేను  అనే అహంకారాన్ని విడిచి, దేహానికి సంబంధించినవి నావి అనే మమకారాన్ని విడిచి తన నిజ స్వరూపాన్ని, ఆత్మస్థితిని మరవకుండా ఉంటారో.. అలాంటి జ్ఞానస్థితే బ్రహ్మస్థితి.   ఇదే జీవుడు బ్రహ్మంతో ఏకమైన జీవ బ్రహ్మైక్య స్థితి. ఇప్పుడు జీవుడు - దేవుడు అని ఇద్దరు లేదు. ఏక అద్వయం...ఇలాంటి బ్రహ్మస్థితిని పొందటం కోసమే మానవ జన్మ వచ్చింది. ఒకసారి ఈ స్థితిని పొందితే మళ్లీ ఎప్పటికీ మోహం వలలో చిక్కుకోరు. అదే మోక్షం. అదే జన్మరాహిత్యం. అదే బ్రహ్మనంద స్థితి. అదే బ్రహ్మనిర్వాణం అదేమానవ జన్మ పరమార్థం

శ్రీ కృష్ణుడు ఇంకా స్థిత ప్రజ్ఞత గురించి చాలా శ్లోకాల్లో వివరించాడు. అవేంటంటే...

  • ఎవరు సమస్త విషయాల్లో ఆశక్తి లేనివాడై ... దానికి సంబంధింది   శుభాలు, అశుభాలు పొందినప్పుడు  ఆనందించకుండా. ..ద్వేషించకుండా ఉంటాడో వాడి బుద్దే స్థిరమైనది.
  • తాబేలు తన అంగాలను లోపలికి  ముడుచుకున్నట్టుగా తన ఇంద్రియాలను విషయ వస్తువుల నుంచి ఉపసంహరించుకుంటాడో అప్పుడు అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది.
  • ఆహారాన్ని విడిచి పెట్టిన మనిషి  నుంచి విషయ వస్తువులు దూరంగా తొలగిపోతాడు. అయితే, విషయ వాసన మాత్రం అలాగే ఉండిపోతుంది. పరమాత్మ దర్శనంతోనే ఆ వాసన కూడా తొలగిపోతుంది.
  •  పార్ధా ! వివేకవంతుడు ఎంత ప్రయత్నించినా మనసుని విషయాలపైకి లాగేస్తుంటాయి. అంతటి బలమైన ఇంద్రియాల్ని తన ఆధీనంలో పెట్టుకొని పరమాత్ముడి వైపు దృష్టి సారించాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో వాళ్ల బుద్దే స్థిరంగా ఉంటుంది.
  • ఎప్పుడూ ఇంద్రియ విషయాల గురించి ఆలోచించే మనిషికి.. వాటి పైనే ఆసక్తి పెరుగుతుంది. దాని వల్ల కోరిక కలుగుతుంది. కోరికల వల్ల కోపం పుడుతుంది. కోపం వల్ల మోహం( అవివేకం) కలుగుతుంది. అవివేకం వల్ల మతి భ్రమిస్తుంది. బుద్ధి నశిస్తుంది. బుద్ధి దేశిస్తే అంతా అయిపోనట్టే..
  • రాగ ద్వేషాల నుంచి విడిపోయి ఇంద్రియాలు .. మనసుని తన వశంలో ఉంచుకొని...  విషయాలతో కలిసి ఉన్నా.. అతడు ప్రశాంతంగానే ఉంటాడు. ప్రశాంతంగా ఉన్నప్పుడు సమస్త దుఃఖాలు నశిస్తాయి. అతని బుద్ధి త్వరలోనే స్థిరంగా మారుతుంది.
  •  నిగ్రహం లేనివాటికి బుద్ధి స్థిరంగా నిలవదు. అలాంటి వాడికి ఆత్మధ్యానం కుదరదు.  ఆత్మ గురించి తెలియనివాడికి శాంతి లేదు..  శాంతి లేనివాడికి లేదు .. కాబట్టి ఎవరి ఇంద్రియాలు విషయ  వస్తువుల నుంచి అన్ని విధాల విగ్రహం కలిగి ఉంటాయో వాడి బుద్దే స్థిరంగా ఉంటుంది.

–వెలుగు, ఆధ్యాత్మికం–