Kamika Ekadasi 2024: పాపాల నుంచి విముక్తి పొందే రోజు ఏది.. ఆరోజు ఏంచేయాలి..

 తెలుగు పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో శుక్ల పక్షంలో ఒక ఏకాదశి..క్రిష్ణ పక్షంలో మరో ఏకాదశిని కలుపుకుని.. ప్రతి నెలా రెండు ఏకాదశి తిథులు వస్తాయి. ఈ పర్వదినాన శ్రీ విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఆషాఢ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు.  ఈ రోజు పూజ చేస్తే పాపాల నుంచి విముక్తి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. 

శాస్త్రాల ప్రకారం, చాతుర్మాస కాలంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ కాలంలో శ్రీ విష్ణుమూర్తిని తులసీ దళాలతో ప్రత్యేక పూజలు చేయడం, వెన్నతో పాటు మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలని పండితులు చెబుతారు.  హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు (31 జూలై 2024) కామికా ఏకాదశి. దీనినే సర్వైకాదశి అంటారు. అదేవిధంగా చాతుర్మాస కాలంలో మొదటి ఏకాదశి కూడా. ఈ రోజున నిత్యం శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల అనేక భయాలు, ఆందోళనలు తొలగిపోతాయని నమ్మకం.

ఆషాఢ కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున కామిక ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈసారి కామికా ఏకాదశి వ్రతాన్ని జూలై31 న పాటించనున్నారు. ఇది చాతుర్మాస తొలి ఏకాదశి. శ్రీమహావిష్ణువు చాతుర్మాస సమయంలో 4 నెలల పాటు యోగా నిద్రలో ఉంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఉపవాసం ఉంటారు.కామికా ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత: కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం క్రమం తప్పకుండా విష్ణువును పూజించడం వల్ల వ్యక్తికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున తులసీ మాతను పూజించాలి. ఆ రోజున ( జులై 31) చేసే దానధర్మాలకు విశేషమైన పుణ్యఫలం ఉంటుంది.

కామికా ఏకాదశి వ్రత కథ

కామిక ఏకాదశి వ్రతానికి సంబంధించిన కథ: కామిక ఏకాదశి వ్రతం రోజున ఏకాదశి వ్రత కథ చదవాలి. లేదా వినాలి. అది లేకుండా ఉపవాసం అసంపూర్ణంగా పరిగణిస్తారు. . ఒక క్రోధ స్వభావం గల గ్రామాధికారి ఒక గ్రామంలో నివసించేవాడు. ఒకరోజు కోపంతో ఒక దుష్టుడిని చంపుతాడు. అతడు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కావడంతో ..  అతనికి బ్రహ్మహత్యా పాపం అంటుకుంటుంది. దానికి ప్రాయశ్చిత్తం కోరుకుంటాడు. ఒక ఋషిని కలిసిన గ్రామపెద్ద.. దుష్టుడిని చంపడానికి, ప్రాయశ్చిత్తం పొందడానికి మార్గమేమిటని అడుగుతాడు. అప్పుడు ఋషి ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి కామికా ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని సలహా ఇస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి అని రుషి చెబుతాడు. ఆ ఉపదేశం ప్రకారం గ్రామాధికారి కామిక ఏకాదశి ఉపవాసం పాటించారు. నిత్యం విష్ణుమూర్తిని పూజించేవారు. అందుకు సంతసించిన శ్రీ హరి గ్రామాధికారికి పాపము నుంచి విముక్తి కల్పిస్తాడు.

కామిక ఏకాదశి పూజా విధానం

కామిక ఏకాదశి ముందు రోజు రాత్రి కేవలం అల్పాహారాన్ని స్వీకరించాలి. ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి ఇంటిని శుభ్రపరచుకొని మావిడి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి. తలస్నానం ఆచరించాలి. ఇంటియందు తూర్పు ఉత్తర లేదా ఈశాన్య భాగంలో మహా విష్ణువును స్థాపన చేసి ఆరోజు విష్ణుమూర్తిని షోడసోపచారాలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి. గంగాజలాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణుమూర్తికి పుష్పాలు, తులసిదళాల సమర్పించాలి. శ్రీ మహావిష్ణువుకు అర్చించే నైవేద్యంలో తులసీ దళాలను చేర్చాలి. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఉపవాసం చేయాలి. ఉపవాస నియమాలు పాటిస్తూ భగవంతుడిని ఆరాధించాలి. కామిక ఏకాదశి రోజు గంధం, పసుపు, సుగంధ ద్రవ్యాలు దానం ఇవ్వాలి. ఇలాంటి వస్తువులను దానం ఇవ్వడం వల్ల విశేషమైన పుణ్య ఫలం కలుగుతుంది.ఆరోజు ( జులై 31) అష్టాదశ పురాణాలు గానీ, రామాయణ, మహాభారతాలు గానీ చదవడం, వినడం చాలా విశేషం. ఇది కుదరని పక్షంలో విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం, భగవద్గీత చదవడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది.

ఏకాదశి రోజున చేయకూడనివి

ఏకాదశి రోజున వెల్లుల్లి, మాంసాహారానికి దూరంగా ఉండాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం పాటిస్తూ ఆహారం గురించి ఆలోచన చేయకూడదు. దానధర్మాలు చేయాలి. చెడు వినరాదు. చెడుచూడరాదు. చెడు మాట్లాడరాదు.