దేశ రాజకీయాల్లో ప్రధాని పీఠంపై ఎవరు కూర్చొవాలి అనే నిర్ణయం ఇప్పడు బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చేతిలో ఉంది. లోక్ సభ 2024 ఎన్నికల్లో జనతాదళ్ (యూ), తెలుగుదేశం పార్టీలు ఎంపీ సీట్లును ఎక్కువగా గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీ ఎన్డీయే కూటమిలో భాగమైనప్పటికీ మద్దతు ఎవరికి ఇస్తారనేదే హాట్ టాపిక్. ఈ రెండు రాష్ట్రాలు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కేంద్రాన్ని స్పెషల్ స్టేటస్ ప్రకటించాలని డిమాండ్ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ విభజన కారణంగా ఏపీ, పేదరికం, ఆర్థికంగా వెనుకబడిన కారణంగా బీహార్ ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో సెంట్రల్ గవర్నమెంట్ ను కోరుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు, నితీష్ కుమార్ లు బీజేపీకి సపోర్ట్ చేసినందుకు స్పెషల్ స్టేటస్ డిమాండ్ కేంద్రం ముందు ఉంచే అవకాశం ఉంది.
స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి?
భారత రాజ్యాంగంలో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం లేదు. కానీ 5వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 1969లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని ప్రవేశపెట్టారు. అసోం, నాగాలాండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే ప్రారంభంలో ఈ ప్రత్యేక హోదా ఉండేది. తర్వాత మరో 8 రాష్ట్రాలకు కూడా హోదా కల్పించారు. ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకూ ప్రత్యేక హోదా ఉంది. దేశంలో ప్రస్తుతానికి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు. ప్రత్యేక హోదాపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 2013లో అప్పటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది.
ప్రత్యేక రాష్ట్ర హోదా ఏలా ఇస్తారు..
ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కేంద్రం కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
* విదేశాలతో సరిహద్దులుండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న రాష్ట్రాలుగా ఉండాలి.
* పర్వత ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలై ఉండాలి.
* ఆర్థిక వనరులు సొంతంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రమై ఉండాలి.
* జనసాంద్రత తక్కువగా ఉండాలి, గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉండాలి.
* రాష్ట్ర వ్యాప్తంగా సరైన మౌలిక సదుపాయాలు లేకుండా ఉండాలి.
స్పెషల్ స్టేటస్ వల్ల లాభాలేంటి?
సాధారణ రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
* కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30శాతం నిధులను మొదట ప్రత్యేక హోదా రాష్ట్రాలకే పంచుతారు. ఆ తర్వాతే మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తారు.
* ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు 90శాతం గ్రాంట్లు గాను, 10 శాతం అప్పుగాను వస్తాయి. గ్రాంట్లగా ఇచ్చిన నిధులు ఆ రాష్ట్రాలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పుగా ఇచ్చిన నిధులను మాత్రం తిరిగి చెల్లించాల్సిందే.
* స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు సైతం భారీగా రాయితీలు ఇస్తారు. 100శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు, ఆదాయపు పన్నులో సైతం 100% రాయితీ లభిస్తుంది.
* పన్ను మినహాయింపులు, కొన్ని స్పెషల్ రీయింబర్స్మెంట్లు ఉంటే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడతారు. ఆయా రాష్ట్రాల్లో వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి.
* ఇండస్ట్రీలు పెట్టేందుకు అనేక అవస్థాపన సౌకర్యాలు నెలకొల్పబడతాయి.