దేశంలో పలు రాష్ట్రాల్లో మంకీ ఫీవర్ కేసులతో వణికిస్తోంది. కర్ణాటక, గోవా, మహరాష్ట్రాల్లో వందల్లో కేసుల బయటపడుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడిన ఇద్దరు చనిపోయారు. ఇప్పటికే 31 మందికి ఈ వ్యాధి సోకింది. 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా 19మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD)గా పిలుస్తున్న మంకీ ఫీవర్ తొలి కేసు జనవరి 16న నమోదైంది. జంతవులు, కోతుల్లో కనిపించే పేలు మనుషులను కాటు వేయడంతో ఈ వ్యాధి సోకుతున్నట్లు వైద్యులు గుర్తించారు. లక్షణాల ఆధారంగానే మంకీ ఫీవర్ ను తెలుసుకోవచ్చు.
కారణాలు
KFD సోకిన పేలు, ముఖ్యంగా హేమాఫిసాలిస్ స్పినిగెరా జాతుల కాటువేస్తే ఈ వ్యాధి మానవులకు సోకుతుంది. ఈ పేలు వ్యాధి సోకిన జంతువుల రక్తాన్ని సేకరించి వైరస్ వాహకాలుగా మారతాయి. అటవి ప్రాంతంలో ఉండి జంతువులకు దగ్గరగా ఉండే వారికి ఈ వ్యాధి తర్వరగా వ్యాపిస్తుంది.
మంకీ ఫీవర్ లక్షణాలు
మంకీ ఫీవర్ తో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ఈ జ్వరం బారిన పడితే ఒక్కసారిగా జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెప్పారు. వ్యాధి తీవ్రత పెరుగుతున్న సమయంలో వాంతులు, విరేచనాలు తదితర సమస్యలుంటాయని తెలిపారు. మంకీ ఫీవర్ తీవ్రత పెరిగితే ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. కొంతమందిలో వణుకు, తూలుతున్న నడక, మానసిక గందరగోళం, కొత్తగా నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని డాక్లర్లు హెచ్చరించారు.
నివారణ మార్గాలు
మంకీ ఫీవర్ కు యాంటీవైరల్ చికిత్స ఇప్పటి వరకూ లేదు. పేషంట్ లో కనిపించే లక్షణాలకు అనుగుణంగా మెడిసిన్ ఇస్తారు. ముందుగానే ఫీవర్ ను గుర్తించి జాగ్రత పడితే మేలు, పేల బారిన పడకుండా ఒంటి నిండా ఉండే దుస్తులను వేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.