కొవిడ్ -19 మహమ్మారి నుండి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సమయంలోనే ఆరోగ్య నిపుణులు కొత్త బాంబును విసిరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నివేదిక ప్రకారం , ఒక కొత్త, మరింత కృత్రిమమైన, చాలా ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచాన్ని తలకిందులు చేయబోతోంది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు దీనికి ఇప్పటికే ' డిసీజ్ X 'గా నామకరణం చేశారు. పలు నివేదికల ప్రకారం, బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఈ డిసీజ్ X వల్ల ఏర్పడిన కొత్త మహమ్మారికి వ్యతిరేకంగా హై-సెక్యూరిటీ లాబొరేటరీ కాంప్లెక్స్‌లో వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇవి మానవులకు వేగంగా సోకగలవు. భవిష్యత్తులో దీని వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 15న తన వార్షిక సమావేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. 'X'అనే వ్యాధిపై పై మేధోమథన సెషన్‌ను నిర్వహించింది. ఇటీవలి పరిశోధనల ప్రకారం, కొవిడ్-19 వైరస్ కంటే 'X'వ్యాధి 20 రెట్లు ఎక్కువ ప్రాణాంతకం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అధికారిక సమావేశానికి X వ్యాధి కోసం సమాయత్తం(Preparation for Disease X) అనే సెషన్‌కు పేరు పెట్టారు. ఈ చర్చను నిర్వహించడానికి వైద్య నేపథ్యానికి చెందిన గొప్ప మేధావులను ఆహ్వానించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వంటి వక్తలు, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి, సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్‌కేర్ హెడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు శ్యామ్ బిషెన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ జెనీవా ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాయ్ జాకోబ్స్, ఆస్ట్రాజెనెకా పిఎల్‌సి బోర్డ్ చైర్ మిచెల్ డెమారే అండ్ రాయల్ ఫిలిప్స్, బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య మంత్రి నిసియా ట్రిండాడే లిమా ఈ సమావేశంలో భాగమయ్యారు.
X వ్యాధి: వైరస్ లక్షణాలు
X వ్యాధి అనేది కొవిడ్-19, ఎబోలా, జికా వంటి ప్రపంచ మహమ్మారుల జాబితాలో చేర్చబడింది. ఈ వ్యాధి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇది వైరస్ వల్ల కలిగే ఓ ఊహాజనిత వ్యాధిగా అర్థం చేసుకోవచ్చు. డిసీజ్ X అనేది కోతులు, కుక్కలు లాంటి ఏ జంతువు నుండయినా మానవులకు వ్యాపిస్తుంది. అయితే ఈ వ్యాధి లక్షణాల విషయానికొస్తే కొన్ని అంటువ్యాధులు ఉండొచ్చని అంటున్నారు. అందులో భాగంగా..
- జ్వరం
- కండరాలలో తిమ్మిరి
- మూర్ఛ
- మెడ నొప్పి
- వెన్నునొప్పి
- తలనొప్పి
- కళ్ళ వాపు
- వికారం
- వాంతులు
- పొత్తికడుపులో అసౌకర్యం
- విరేచనాలు
- గొంతు నొప్పి
అప్రమత్తంగా ఉండాలంటున్న WHO
2023 సెప్టెంబరులో, UKలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు 1918-1920 నాటి స్పానిష్ ఫ్లూ వలె తదుపరి మహమ్మారి వినాశకరమైనదని, ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొనే అవకాశం ఉందని తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 మిలియన్ల మందిని బలిగొన్న ఇటీవలి కొవిడ్ మహమ్మారి వలే.. వ్యాధి X కోసం సిద్ధం కావాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా, అనేక వ్యాధికారక కారకాలు ఉన్నాయని, అయితే వ్యాధి పరిశోధన, అభివృద్ధికి వనరులు పరిమితంగా ఉన్నాయని WHO నొక్కి చెప్పింది. ఈ పరిస్థితి కొత్త, ఊహించని ఆరోగ్య బెదిరింపుల ద్వారా ఎదురయ్యే అనూహ్య సవాళ్ల నుండి రక్షించడానికి ప్రపంచ సహకారం, అప్రమత్తతను కోరుతుంది.