ఇంట్లో నుండి బయటకొస్తే మాస్కులు పెట్టుకోవాలని నేతలు.. అధికారులు.. సెలబ్రిటీలు టీవీల్లో.. పేపర్లలో.. చివరకు సోషల్ మీడియాలో పబ్లిక్ కూడా సందేశాలతో హోరెత్తిస్తున్నారు. ఎవరెంత చెబుతున్నా కొంత వినడం లేదు.. కేర్ లెస్ గా తిరుగుతున్నారు. ఇలాంటి వారి తీరుతో విసిగిపోయిన ఏపీలోని అనంతపురం జిల్లా పోలీసులు కాస్త వెరైటీగా ఆలోచించారు. అంబులెన్స్ కు ఖాళీ ఉందంటే..పిలుపించుకుని కేరె లెస్ గా తిరిగేవారిని పట్టుకుని కరోనా పేషెంట్లు ఉండే క్వారెంటైన్ కు పంపడం ప్రారంభించారు. గురువారం ఆఫీసర్స్ క్లబ్ ఎదురుగా ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద కొంత మంది సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుమిగూడడం.. మాస్కులు కూడా పెట్టుకోకపోవడం గమనించారు. వెంటనే అంబులెన్స్ ను రప్పించి దొరికిన వారిని దొరికినట్లే రెక్క పుచ్చుకుని ఎత్తుకెళ్లి అంబులెన్స్ లో కుదేశారు. సార్ సార్.. మమ్మల్ని వదిలేయమంటూ సదరు యువకులు గింజుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే.. పోలీసులు కాళ్లు చేతులు పట్టుకుని ఎత్తుకెళ్లి క్వారెంటైన్ తరలించారు. మీడియా వారితోపాటు.. స్థానికులు సెల్ ఫోన్లలో తీసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

