రూపాయి పతనంతో ప్రతికూల పరిణామాలివీ..

రూపాయి పతనంతో ప్రతికూల పరిణామాలివీ..

చరిత్రలో తొలిసారిగా డాలరుతో రూపాయి మారకం విలువ ఇవాళ రూ.80.05కి చేరింది. మరో రెండు నెలల్లో ఇది రూ.82కి చేరినా ఆశ్చర్యం లేదని పలు బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రూపాయి విలువ ఇంతలా పడిపోవడం వల్ల  ఆర్థిక వ్యవస్థపై పడే పలు ప్రతికూల ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

దిగుమతి వ్యయాలు పెరిగిపోతాయ్ :  రూపాయి విలువ పడిపోతున్న కొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతుంది. ఫలితంగా దిగుమతి వ్యయాలు పెరిగిపోతాయి. విదేశం నుంచి భారత్ కు దిగుమతి చేసుకునే ఒక వస్తువుకు గతంలో కంటే ఈసారి ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. గతంలో ఒక డాలరుకు రూ.79 చెల్లిస్తుండగా, ఇకపై రూ.80 లెక్కన పేమెంట్ చేయాలి. ఈ పరిణామంతో విదేశాల నుంచి భారత్ కు దిగుమతి అయ్యే వస్తు, ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి. 

ఇంధన ధరలకు రెక్కలు : మన దేశానికి అవసరమైన ఇంధన వనరుల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల.. ముడి చమురు కొనుగోలు వ్యయాలు పెరిగిపోతాయి. ఈ భారాన్ని చముురు మార్కెట్ కంపెనీలు వినియోగదారులకు బదలాయిస్తాయి. ఇందులో భాగంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతాయి. 

విదేశీ విద్య, అంతర్జాతీయ ప్రయాణం ప్రియం : విదేశీ ప్రయాణ ఖర్చు కూడా పెరుగుతుంది. మన దేశం నుంచి ఓ దేశానికి విమాన టికెట్ ధర 1000 డాలర్లు ఉందని అనుకుందాం. డాలరుకు రూ.79 చొప్పున  గతంలో  టికెట్ కొనుగోలుకు రూ.79,000 చెల్లిస్తే.. రూ.80 లెక్కన ఇప్పుడు రూ.80,000 దాకా కట్టా్ల్సి ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులు కూడా గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని ఫీజుగా చెల్లించాల్సి వస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 శాతం పడిపోయింది. అంటే ఈ ఏడాది అంతర్జాతీయ ప్రయాణ వ్యయాలు, విదేశీ విద్య  7 శాతం ప్రియమయ్యాయని అర్ధం.