WA vs TAS: క్రికెట్ చరిత్రలో నమ్మలేని వింత.. ఒక్క పరుగుకే 8 వికెట్లు

ఆస్ట్రేలియా వన్డే కప్ లో అద్భుతం చోటు చేసుకుంది. టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా కేవలం ఒక పరుగుకే తన చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది. వినడానికి ఆశ్చర్యరంగా ఉన్నా ఇది నిజం. శుక్రవారం(అక్టోబర్ 25) పెర్త్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో వన్డే కప్ చరిత్రలోనే వెస్ట్రన్ ఆస్ట్రేలియా తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 1969లో విక్టోరియాతో జరిగిన మ్యాచ్ లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 59 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవరాల్ గా టోర్నమెంట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్. 

2 వికెట్లకు 52 పరుగులతో పటిష్టంగా కనిపించిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. 53 పరుగులకు ఆలౌట్ కావడం షాకింగ్ కు గురి చేస్తుంది. టాస్మానియా పేసర్ బ్యూ వెబ్‌స్టర్ తన ఆరు ఓవర్లలో 17 పరుగులిచ్చి 6 వికెట్లను తీసుకున్నాడు. బిల్లీ స్టాన్‌లేక్ మూడు వికెట్లు పడగొట్టగా, టామ్ రోజర్స్ ఒక వికెట్ తీశాడు. ఆరుగురు వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ హిల్టన్ కార్ట్‌రైట్, కూపర్ కొన్నోలీ, అష్టన్ టర్నర్, అష్టన్ అగర్, ఝై రిచర్డ్‌సన్, జోయెల్ పారిస్ డకౌట్‌ అయ్యారు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 1 పరుగు చేశాడు. 

Also Read:-ఏడు వికెట్లతో సాంట్నర్ విజృంభణ..

షార్ట్ 22 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టార్ బ్యాటర్లతో నిండిన జట్టు ఒక్కసారిగా కుప్పకూలడం సంచలనంగా మారింది.    54 పరుగుల లక్ష్యాన్ని టాస్మానియా 3 వికెట్లు కోల్పోయి 9 ఓవర్లలో 54 పరుగులు చేసి గెలిచింది. మిచెల్ ఓవెన్ 29 పరుగులు చేసి స్వల్ప లక్ష్య ఛేదనలో జట్టుకు త్వరగా విజయాన్ని అందించాడు.